Cash For Vote in Telangana Election 2023 :ఓటు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వజ్రాయుధం. ఒకే ఒక్క ఓటు ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు.. అవే ప్రభుత్వాలను కూలగొట్టవచ్చు. అలాంటి ఓటును కేవలం నాలుగు నోట్ల కాగితాలకు అమ్ముకుంటే మన భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆ నాలుగు నోట్లను మీకిచ్చి.. మీ, మీ బిడ్డలు, భావితరాల భవిష్యత్తును కూడా ఓవర్ జోన్లో పడేసే స్థితికి తీసుకువస్తున్నారు. కొంతమంది నాయకులు ఇలా ఉంటే.. కొన్నిప్రాంతాల్లో ఓటర్లు కూడా తక్కువేం కాదంటూ 'మా వద్ద ఓట్లున్నాయి మీ రేటెంత' అంటూ అభ్యర్థులతో బేరాలాడుతున్నారు.
మా వద్ద 800 ఓట్లు ఉన్నాయి ఎంత రేటు : "మా వాళ్లందరి ఓట్లు(Votes) 800 ఉన్నాయి.. అయితే ఇప్పటివరకు మేము ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం సార్. మాకు ఒక్కో ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే.. కాదంటే చెప్పడం మరో పార్టీ పిలుస్తోంది. అయితే మీరు తమకు అడ్వాన్స్ ఇస్తే.. మీకే ఫిక్స్ అయిపోతాం" ఇలా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మధ్యవర్తులు గల్లీనేతలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు.
బిర్యానీ, మాంసం కూర పార్శిల్స్ ఇంటి వద్దకే : ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్ హాల్లో వారం రోజులుగా ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రోజుకు కనీసం 1000 మందికి సరిపడేలా మాంసాహార భోజనం సిద్ధం చేస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకులే భరిస్తూ.. అక్కడికి రాని వారికి ఇంటికే పార్శిల్ పంపుతున్నారు.
Temptations in Telangana Elections 2023 :అయితే టోలిచౌకి ప్రాంతంలో ఆదివారం నుంచే ఇలా భోజనం సిద్ధం చేస్తున్నారు. డివిజన్లలో ఉండే నాయకులు.. తటస్థ ఓటర్లను గుర్తించి.. వారిని ప్రలోభానికి గురి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో(Telangana Election) పోరు రసవత్తరంగా ఉండగా.. ఒక్క ఓటైనా వారి తలరాతను మార్చేదిగా భావిస్తున్నారు. అందుకే చోటా, గల్లీ నేతలు వారి కటాక్షం పొందే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలు అభ్యర్థులతో మంతనాలు జరుపుతూ.. వారి చేతుల్లో ఉన్న ఓట్లన్నీ వేయిస్తామని హామీ ఇస్తున్నారు. అందుకు భారీ మొత్తంలోనే గుంజుతున్నారు.