లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించొద్దని ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. నచ్చజెప్పినా... లాఠీలకు పనిచెప్పినా ఎంత మందినని కట్టడి చేయగలరు. బాధ్యతగా ఉండాల్సిన పౌరులు బుద్ధి మార్చుకోకపోతే... భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
రోజురోజుకు పెరుగుతున్నాయి
రెండు రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేలల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై సాంకేతికతను వాడి కేసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 25న 7,497... 26న 9వేలు.. 27న 8,500 కేసుల నమోదు చేశారు. వీటితో పాటు సాధారణ తనిఖీల్లో మరో 2,312 వాహనాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు 683 వాహనాలను సీజ్ చేశారు.