Cases Against Telangana Police 2023 : హైదరాబాద్‌లో కొందరు ఖాకీలు (Case Files On Police)పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోతున్నారు. సివిల్ తగాదాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో తలదూర్చడం, లంచం తీసుకుని కేసుల్లోని అసలు నిందితులకు బదులు, మరొకరిని అరెస్టు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా భార్యాభర్తల పంచాయితీలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Police Case on Ex MLA Shakeel Son :పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ వద్ద, ఈనెల 24న మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్లను కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు నడిపిన వ్యక్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌గా పోలీసులు గుర్తించారు. అతన్ని పంజాగుట్ట సీఐ దుర్గారావు తప్పించి, అతని కారు డ్రైవర్ కారు నడిపినట్టు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం బయటపడడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి, సదరు సీఐని సస్పెండ్ చేశారు. ఈ కేసులో దుర్గారావుకి భారీగా డబ్బులు ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిందితుడిని తప్పించడం వల్లే అతను దుబాయి పారిపోయినట్టు అధికారులు గుర్తించారు.
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు
Cops Suspended in Hyderabad 2023 : కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దంపతుల వ్యవహారంలో, భర్తపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఓ ఉన్నతాధికారి ఆదేశం మేరకు కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ ప్రణీత్‌ను తీవ్రంగా కొట్టాడు. ఆసుపత్రి పాలైన బాధితుడు, జరిగిన విషయాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ జరిపి సీఐపై వేటు వేశారు. ఎస్‌ఐ సహా మరికొంత మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఇంకో కేసులో మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ గిరీష్ కుమార్, భార్యాభర్తల కేసు వ్యవహారంలో ఠాణాకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారనే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.