నకిలీ ఇంజినీరింగ్ పట్టాలతో అమెరికాకు వెళ్తున్న అక్రమార్కుల సంఖ్య క్రమంగా పెరుతోంది. అమెరికాకు నకిలీ వీసాలతో వెళ్లిన వారిలో 11 మందిని 3 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల వ్యవధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు 56 మంది కన్సల్టెంట్లు, విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అమెరికాను ఎంచుకుంటున్న అక్రమార్కులు.. తొలుత ఎంఎస్ చదివేందుకు.. తర్వాత అక్కడే ఉద్యోగం చేసేందుకు వీలుగా లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ అక్రమాలపై దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. దీనిపై కూపీలాగిన దిల్లీ పోలీసులు.. అక్రమ పద్ధతుల్లో అమెరికాకు వెళ్లిన 20 మందిని కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు.
నకిలీ వీసా వ్యవహారంపై ఈ నెల 10న హైదరాబాద్ వచ్చిన దిల్లీ పోలీసులు.. చైతన్యపురిలోని ఐ-20 అబ్రోడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని కపిల్‌ను.. అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కి చెందిన ఓ విద్యార్థి ఉద్యోగం చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని 4, గుంటూరులో రెండు కన్సల్టెన్సీలకు సంబంధించిన ఏజెంట్లను, వారి నుంచి సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నకలీ సర్టిఫికెట్లతో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిపైనా.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కన్సల్టెన్సీలపై దృష్టి పెట్టారు.