తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం.. మాస్క్ మర్చిపోవద్దు.. - carelessness among people increased in telangana

మాస్కు తప్పనిసరిగా ధరించాలనీ.. భౌతిక దూరాన్ని పాటించాలనీ.. చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలనీ.. ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు పదేపదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక్కరి కారణంగా ఎందరో వైరస్‌ బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ కట్టడికి ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం.. మాస్క్ మర్చిపోవద్దు..
ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం.. మాస్క్ మర్చిపోవద్దు..

By

Published : Jun 4, 2020, 9:14 AM IST

  • ఖైరతాబాద్‌కు చెందిన ఒక తోపుడు బండి వ్యాపారి రోడ్డు మీద పండ్లు, కూరగాయలు, పూలు తదితరాలు విక్రయిస్తుంటాడు. ముఖానికి మాస్కు పెట్టుకుంటాడు గానీ.. అది ఎప్పుడూ సరైన స్థానంలో ఉండకుండా కిందికి వేలాడుతూనే ఉంటుంది. కొనుగోలుదారులతో మాట్లాడేటప్పుడు మాస్కు ధరిస్తే మాటలు సరిగా వినబడడం లేదనే కారణంతో.. దాన్ని కిందకు జరుపుతుంటాడు. దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా.. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా బయటపడింది. అతడి కుటుంబీకుల్లో 9 మందికి వైరస్‌ సోకింది. ఇప్పుడందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాపారి వల్ల ఇంకా ఇతని వద్ద కొనుగోలు చేసినవారిలో ఎంతమందికి వైరస్‌ సోకిందో తెలియదు.
  • ఇంజినీరింగ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ అధికారి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి పలుమార్లు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈయన ముందస్తు జాగ్రత్తగా మాస్కు ధరించే వెళ్లేవారు. కానీ ఆసుపత్రికి వచ్చే ఇతర రోగులు, వారి సహాయకుల్లో చాలామందిలో ఆ స్పృహ లేదు. వ్యక్తిగత దూరం కూడా పాటించేవారు కాదు. వైద్యుని కోసం వేచి చూడాల్సిన స్థితిలో వారి పక్కనే కూర్చోవాల్సి వచ్చేది. ఐదు రోజుల కిందట దగ్గు, జ్వరం రావడంతో అనుమానంతో వైద్యసిబ్బందిని సంప్రదించగా, కొవిడ్‌గా నిర్ధారించారు. ఫలితంగా కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌లో ఉంచారు.

మాస్కు తప్పనిసరిగా ధరించాలనీ.. వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలనీ.. ఏదైనా వస్తువును తాకిన ప్రతి సందర్భంలోనూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలనీ.. ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు పదేపదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక్కరి కారణంగా ఎందరో వైరస్‌ బారినపడుతున్నారు. ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ సోకుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్లు వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తొలుత అంతర్జాతీయ ప్రయాణికులు.. తర్వాత మర్కజ్‌.. వారి సన్నిహితులు.. ఆ తర్వాత వలస కార్మికులు.. ఇలా వైరస్‌ వ్యాప్తికి కొంత కాలం వరకూ కారణాలుగా గుర్తించినా.. ప్రస్తుతం అత్యధిక కేసులు రాష్ట్రవాసుల్లోనే వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు కారణమనే స్పష్టత కొరవడిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్‌ కట్టడికి ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అవగాహన ఉండీ..

ఇటీవల ఒక ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి వద్ద జరిగిన సమావేశంలో సంబంధిత శాఖకు చెందిన అధికారులు ఒకే గదిలో కిక్కిరిసి కూర్చుని ఉన్నారు. అందులో కొందరు మాస్కులు పెట్టుకున్నారు. మరికొందరు పెట్టుకున్నా కిందకు వదిలేశారు. గుసగుసలాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరిలో కరోనా వైరస్‌ ఉన్నా.. ఆ గదిలో ఉన్న అధికారులందరికీ వైరస్‌ సోకే ప్రమాదముంది. ఈ విషయం వారికి తెలియదా అంటే.. ఆ మాత్రం అవగాహన వారిలో ఉంది. కాకపోతే తమకేమి కాదనే ధీమా. తమ పక్కనున్నవారు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు కాబట్టి.. వారిలో వైరస్‌ ఉండదనే భ్రమ. ఇలాంటి పరిణామాలు ఎంతో ప్రమాదకరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయాల్లో, కార్యాలయాలకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మాస్కులు కిందకు వదిలేయడం కొంతమందిలో సాధారణమైంది.

  • బస్తీల్లో నిత్యావసరాల కోసం వెళ్లిన సందర్భాల్లోనూ పలు చోట్ల ఇదే ధోరణి కనిపిస్తోంది. వ్యక్తిగత దూరాన్నీ పట్టించుకోవడంలేదు.
  • లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో రాకపోకలు కూడా పెరిగిపోయాయి. ఆటోలు, టాక్సీల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా నిబంధనలను ఉల్లంఘించి ఐదారుగురు ఒకే వాహనంలో వెళ్తున్నారు.
  • గ్రామీణంలోనూ ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పుడు పల్లె, పట్నమంటూ తేడా లేకుండా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పక్కనున్న ప్రతి వ్యక్తిలోనూ వైరస్‌ ఉందేమోనని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప.. తెలిసినవారే కదా అని చనువుగా దగ్గరకెళ్లిపోయి మాటామంతీ సాగించకూడదు. ఉభయులూ మాస్కు ధరించినా సరే ఆరడుగుల దూరం పాటిస్తేనే కరోనా నుంచి ప్రాథమికంగా రక్షణ లభిస్తుంది.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

మాస్కు ధరించమని చెప్పండి... వినకపోతే అక్కణ్నించి వెళ్లిపోండి

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో స్వీయ జాగ్రత్తలే కాపాడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావద్దు. మాస్కు లేకుండా ఎవరైనా మాట్లాడుతుంటే.. వారిని ధరించమని చెప్పండి. వినకపోతే అక్కణ్నించి వెళ్లిపోవడం మంచిది. ఎందుకంటే దగ్గు, తుమ్ముల ద్వారానే కాదు.. మాట్లాడుతుంటే తుంపర్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించాల్సిందే. ఏ వస్తువును ముట్టుకోవాల్సి వచ్చినా.. ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. ఇది కఠిన సమయం.

ABOUT THE AUTHOR

...view details