పోలీసులకు పట్టుబడితే కేసులు. చాకచక్యంగా తప్పించుకుంటే కాసులు. ఇదీ గంజాయి వ్యాపారుల మొండితనం. 2020లో మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 3341 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 2090 కిలోలు పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.3 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఖాకీల కన్నుగప్పి అడ్డదారిలో దర్జాగా నగరానికి రవాణా అయ్యే గంజాయి విలువ భారీగా ఉంటుందని అంచనా. గ్రేటర్‌ను కేంద్రంగా మార్చుకుని ఇతర జిల్లాలు/రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న సూత్రదారులు తెరవెనుక నుంచే మంత్రాంగం నడిపిస్తున్నారు.
సులువుగా రవాణా..
కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ వంటి మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. గంజాయి రవాణా సమయంలో ఎటువంటి వాసన ఉండదు. తేలికగా దొరుకుతుంది. సులువుగా తీసుకునే వీలుంది. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే లక్షలాది మంది యువత. వినోద, విహారాలతో వారాంతం సరదాగా గడిపే కుర్రకారు.. పార్టీల్లో పొందే ఆనందాన్ని రెట్టింపు ఆస్వాదించేందుకు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఏటేటా వాడకందారులు పెరగటంతో దీనికి డిమాండ్ పెరిగింది. సరఫరా రెట్టింపునకు చేరింది. మూడేళ్ల క్రితం 10 గ్రాముల గంజాయి రూ.50 లోపు దొరికితే ప్రస్తుతం అది రూ.200-300కు చేరింది. రూ.10,000 పెట్టుబడితో రూ.లక్ష వరకూ సంపాదించే అవకాశం రావటంతో మత్తుకు అలవాటు పడిన యువకులు స్మగ్లర్లుగా అవతారమెత్తుతున్నారు.
పేట పేటకో సూత్రధారి
నగర శివారు ఎల్బీనగర్‌లో ఉండే గంజాయి వ్యాపారి. చుట్టుపక్కల ప్రాంతాలకు తానే సరఫరా చేస్తుంటాడని సమాచారం. పహడీషరీప్, నానక్‌రామ్‌గూడ, కార్ఖానా, రెజిమెంటల్‌బజార్, కాచిగూడ, విజయనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో ఒక్కొకరి చొప్పున పంచుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. పురానాపూల్, తలాబ్‌కట్ట, భవానీనగర్ వంటి చోట్ల ఆధిపత్యం చాటుకునేందుకు కొందరు యువకులను చేరదీస్తున్నారు. ఒకరి ప్రాంతంలోకి మరొకరు వచ్చి వ్యాపారం చేయకూడదనే నిబంధన కూడా ఉండటం విశేషం. దీన్ని అతిక్రమించినట్టు గుర్తిస్తే దాడులకు తెగబడుతుంటారు. దందా బట్టబయలు కాకుండా స్థానిక నేతలు, యంత్రాంగాన్ని బహుమతులతో నోరు మెదపకుండా చేస్తారు. విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు పోలీసు, ఎక్సైజ్‌శాఖల దాడులతో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
పక్కా వ్యూహంతో లావాదేవీలు
గ్రేటర్ పరిధిలో గంజాయి విక్రయాలకు ప్రత్యేక బృందాలుంటాయి. ఆయా ప్రాంతాల్లో పాతుకుపోయిన వ్యక్తులే దందా సాగిస్తుంటారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, విశాఖ, రాజమండ్రి, వరంగల్ తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ముఠా నాయకులకు దళారులుంటారు. వారి ద్వారానే సరకును ఏ సమయంలో ఎక్కడికి పంపాలనేది ఆధారపడి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, అంబులెన్స్‌ల వంటి వాటిని రవాణాకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అటు-ఇటు కీలక వ్యక్తులు ఎవరనేది చెప్పకుండానే క్రయవిక్రయాలు సాగిస్తుంటారు. దళారులు, విక్రయదారుకు అందించాల్సి డబ్బును డిజిటల్/మూడో వ్యక్తి ద్వారా అందజేస్తుంటారు. ఏపీ, ఒడిశాల నుంచి హైదరాబాద్ చేరే గంజాయిను శివారు గోదాముల్లో నిల్వ చేసుంటారని సమాచారం. అక్కడ నుంచి గ్రాముల పరిమాణంలో పొట్లాలుగా మార్చి కొనుగోలుదారులకు చేరవేస్తుంటారు. ఇది కూడా ఇల్లు/కార్యాలయం వద్ద గాకుండా జనసమ్మర్థం ఉన్న బహిరంగ ప్రాంతాల్లోనే ఎక్కువగా అందజేస్తుంటారని ఆబ్కారీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి:Drugs Addiction: మత్తుకు యువత చిత్తు.. ఆందోళనకరంగా పరిస్థితులు