Candidates Survey in Telangana Assembly Elections : రాష్ట్రంలోని పార్టీల అభ్యర్థుల ఎంపికలో సర్వేలు కీలకపాత్ర పోషించాయి. సర్వేలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నవారికే అభ్యర్థిత్వాలను ( Candidates Survey in Telangana) ఖరారు చేసి బీ ఫాంలను అందజేశారు. ప్రస్తుతం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో నియోజకవర్గాల్లో మరో దఫా సర్వేలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల ఎత్తుగడలు, లోటుపాట్లను తెలుసుకుంటూ విజయాన్ని చేజిక్కించుకునేందుకు సర్వేలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయాలి? అసలు అఫిడవిట్ అంటే ఏమిటి?
పంథా మార్చిన పార్టీలు :ఒకప్పుడు పార్టీలు తమ కార్యకర్తల అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో ఆశావహుల పనితీరు.. ప్రజల్లో వారికున్న ఆదరణను ప్రామాణికంగా తీసుకుని టికెట్లను ఖరారు చేసేవి. కానీ ఇప్పుడు ప్రధాన పార్టీలు తమ పంథాను మార్చుకున్నారు. అభ్యర్థిత్వాల ఖరారుకు సర్వేలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేక యంత్రాంగాలనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అయితే ఆది నుంచి సర్వేలకు ప్రాధాన్యత ఇస్తోంది.
Telangana Assembly Elections 2023 : ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ గత ఆరు నెలల నుంచి.. మూడు సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక సర్వే బృందాలు ఉన్నాయి. భారత్ రాష్ట్ర సమితి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లనుసర్వే బృందాలకు అందజేశాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదట ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని సర్వేలు చేయించాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశాయి. అభిప్రాయ భేదాలు వచ్చిన కొన్నిచోట్ల ఫ్లాష్ సర్వేలను నిర్వహించి చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.
పోలింగు ముగిసే వరకు : ప్రస్తుతం రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో(Nominations Process Concluded in Telangana).. ఇప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు పార్టీలు మరో విడత సర్వే నిర్వహించనున్నాయి. బీఆర్ఎస్ సర్వే బృందాలు ఇప్పటికే నియోజకవర్గాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. ఆయా పార్టీలకు సంబంధించిన సర్వే బృందాలు.. అభ్యర్థి ప్రచారం తీరు ఎలా ఉంది? అసంతృప్తితో ఎవరైనా ఉన్నారా? ప్రజల నుంచి ఆదరణ ఎలా లభిస్తోంది? ఎవరు మద్దతు ఇస్తున్నారు? ప్రచారంలో ఎలాంటి మార్పులు చేయాలి? అనుకూలతలు, ప్రతికూలతలు ఏంటీ? పట్టణాలు, గ్రామాల వారీగా సమావేశాలు, సభలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలి? తదితర వివరాలను సేకరిస్తున్నాయి. సర్వేల్లో వచ్చిన అభిప్రాయాలు, తెలిసే విషయాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వ్యూహాన్ని మార్చి ప్రచారాన్ని పదునెక్కించాలని భావిస్తున్నాయి.