TET Exam: ఉపాధ్యాయ కొలువులకు రాష్ట్ర సర్కారు సమాయత్తమవుతోందన్న ఆనందం అటుంచితే బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, భాషాపండిత అభ్యర్థులు టెట్‌ను తలచుకొని ఆందోళనచెందుతున్నారు. వారు ఇంటర్, డిగ్రీలో చదివింది జీవశాస్త్రం. మరికొందరు తెలుగు సబ్జెక్టును పూర్తిచేశారు. వారందరికీ ఇపుడు గుండె దడ మొదలైంది. తాము ఏమాత్రం చదవని.. ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినా బోధించని సబ్జెక్టులపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇస్తోండటంతో కలవరపడుతున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో టెట్ నిర్వహించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)కు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 నిర్వహిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) ఆదేశాల ప్రకారం ఈసారి పేపర్-1కు డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ పూర్తిచేసిన వారికీ అర్హత కల్పించాల్సి ఉంటుంది. టెట్‌ను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తే ఓసీలకు 60 శాతం, బీసీలకు 50, ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతాన్ని అర్హత మార్కులుగా నిర్ణయించారు. టెట్‌లో కనీస మార్కులు సాధిస్తేనే డీఎస్‌సీ పరీక్ష రాయడానికి వీలవుతుంది. రాష్ట్రంలో డీఈడీ పూర్తిచేసినవారు 1.50 లక్షలు, బీఈడీ అభ్యర్థులు 3 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. వారిలో గతంలో టెట్ అర్హత సాధించనివారికి, 2017 తర్వాత బీఈడీ పాసైన బయాలజీ, భాషా పండిత అభ్యర్థులకు ఇపుడదే పరీక్ష తలనొప్పిగా మారింది.