తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాన్సర్‌ రోగుల్లో కరోనా ముప్పు... వైరస్‌ తీవ్రత తగ్గే వరకూ చికిత్సలకు రావొద్దు' - కరోనావైరస్ చికిత్స

సాధారణ ప్రజలతో పోలిస్తే.. కరోనా వైరస్‌ వల్ల ప్రమాద తీవ్రత క్యాన్సర్‌ రోగుల్లో అధికంగా ఉంటుందని హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప అన్నారు. కరోనా సమయంలో క్యాన్సర్​ రోగులు పాటించాల్సిన నిబంధనలను స్పష్టం చేశారు.

cancer specialist senthil rajappa interview
క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప

By

Published : Apr 9, 2020, 8:28 AM IST

చైనాలో కరోనా వైరస్‌ సోకిన సాధారణ పౌరుల్లో మరణాలు 2-3 శాతం ఉండగా.. కొవిడ్‌ 19 బారిన పడిన క్యాన్సర్‌ రోగుల్లో మరణాలు సుమారు 20 శాతం వరకూ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వైద్య నిపుణులు డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు.

క్యాన్సర్‌ రోగులపై కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుంది?

క్యాన్సర్‌ రోగుల్లో ఎక్కువమంది 60 ఏళ్లు పైబడిన వారుంటారు. వారిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటివి ఉండడం సాధారణమే. ఫలితంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికిచ్చే కీమో థెరపీ, రేడియేషన్‌ థెరపీ చికిత్సల వల్ల కూడా రోగ నిరోధక శక్తి మరింతగా క్షీణిస్తుంది. అసలే ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉన్న వారికి.. ఇప్పుడు కరోనా రూపంలో కొత్త ప్రమాదం వచ్చి పడింది. వారికి త్వరగా ఈ వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. సోకితే.. ఐసీయూ, వెంటిలేటర్‌ చికిత్సలందించాల్సిన తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి. మరణాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశాలున్నాయి.

క్యాన్సర్‌ అంటేనే ప్రాణాలతో చెలగాటమనే భావన రోగుల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు వారు చికిత్స కోసం ఆసుపత్రులకు రాకుండా ఉండడం సాధ్యమేనా?

నిజమే. క్యాన్సర్‌ రోగులు నిర్దేశిత సమయాల్లో చికిత్స పొందాల్సిందే. అయితే ఇక్కడ చికిత్సల్లో రెండు మూడు అంశాలను పరిశీలనలోకి తీసుకోవాలి. కొందరికి చికిత్సలతో వంద శాతం నయమవుతుంది. అలాంటివారికి చికిత్సలను వాయిదా వేస్తే రోగి ప్రాణానికి ముప్పు ఉంటుంది. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి.. సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయమవుతుంది. ఇలాంటి కేసుల్లో చికిత్సలను కొనసాగించాల్సిందే. కొన్ని జబ్బుల్లో చికిత్స అందిస్తుంటాం గానీ.. నయం కాదు. కేవలం జీవితకాలాన్ని మరికొంత పొడిగించడానికే ఆ చికిత్స ఉపయోగపడుతుంది. ఇలాంటి వారికిచ్చే చికిత్సల్లో స్వల్ప మార్పులను సూచిస్తున్నాం. సర్జరీలను వాయిదా వేసుకోవాలని చెబుతున్నాం. సాధారణంగా చికిత్సల్లో కొన్నిసార్లు ముందుగా సర్జరీ చేసి, తర్వాత కీమో థెరపీ, రేడియేషన్‌ థెరపీ ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ముందుగా థెరపీ చికిత్సలను ఇస్తున్నాం. కొద్దిమందికి ఆసుపత్రులకొచ్చి ఐవీ ద్వారా చికిత్స పొందాల్సిన అవసరం ఉంటుంది. వారికి నోటి మాత్రలను సూచిస్తున్నాం. ఔషధాల వల్ల రోగ నిరోధక శక్తి మరింత క్షీణిస్తుందని భావించినప్పుడు.. ఆ మేరకు తక్కువ మోతాదు మాత్రలను అందిస్తున్నాం. ఇక నిర్దేశిత తేదీల్లో ముందస్తు ప్రణాళికతో వైద్యుని సంప్రదింపులకు వచ్చేవారిని కొన్నివారాల వరకూ రావద్దని చెబుతున్నాం. అత్యవసరమైతే తప్ప.. సాధ్యమైనంత వరకూ శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నాం. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా పెద్దసంఖ్యలో రోగులు ఆసుపత్రులకు రాకుండా తగ్గించడానికి ప్రయత్నించాల్సిందే.

టెలీ మెడిసిన్‌ వంటివి కూడా ఈ సందర్భంగా అక్కరకొస్తాయా?

తప్పనిసరిగా అక్కరకొస్తాయి. ఇప్పుడు ఈ విధానంలో చికిత్స అందిస్తున్నాం. వాట్సప్‌ తదితర మాధ్యమాల ద్వారా వీడియో కాల్‌ చేసి రోగితో నేరుగా మాట్లాడి, వారికి అవసరమైన సూచనలిస్తున్నాం. క్యాన్సర్‌ రోగులకు నా సూచన ఏంటంటే.. మీరు బయటకు వస్తే మీతో పాటు.. మీతో వచ్చే సహాయకులకూ కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అప్పుడు నేరుగా ఆసుపత్రికి రావాలి.

కరోనా విషయంలో క్యాన్సర్‌ రోగులు తీసుకోవాల్సిన ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలున్నాయా?

సాధారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. క్యాన్సర్‌ రోగులూ ఆ జాగ్రత్తలే పాటించాలి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా క్యాన్సర్‌ రోగులకు దూరంగా ఉండాలి. వారిని మరింత ప్రమాదంలోకి నెట్టేయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'

ABOUT THE AUTHOR

...view details