తెలంగాణ

telangana

ETV Bharat / state

బల్దియా పోరు: గల్లీల నిండా జిల్లాల నాయకులే! - GHMC elections

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మహానగర ఎన్నికలు బస్తీల స్థాయిలో కాక పుట్టిస్తున్నాయి. పార్టీలన్నీ బూత్‌ కమిటీల ఏర్పాటు, బలాబలాలు, లోపాల దిద్దుబాటుకు ఉపక్రమించేలోపే ఎన్నికల ప్రకటన వచ్చేయడంతో అవి మరింత అప్రమత్తమయ్యాయి. బూత్‌ స్థాయిలో ప్రతి ఓటునూ చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఆయా పార్టీలు వివిధ జిల్లాల నుంచి తమ కేడర్‌ను తీసుకొచ్చి నగరంలో మోహరించాయి. మండలాలు, పంచాయతీల ప్రతినిధులను రంగంలోకి దింపాయి.

Campaigning of District Leaders in GHMC Elections
బల్దియా పోరు: గల్లీల నిండా జిల్లాల నాయకులే!

By

Published : Nov 28, 2020, 9:06 AM IST

Updated : Nov 28, 2020, 9:31 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఏ డివిజన్‌ పరిధిలో చూసినా, ఏ గల్లీలో చూసినా ఇతర జిల్లాల నాయకులు, కార్యకర్తలు భారీగా కనిపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జికి కలిపి 90-100 బూత్‌ల బాధ్యతలు అప్పగించారు. ఓ పార్టీ ఇంకో అడుగు ముందుకేసి బూత్‌ స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

‘బూత్‌’కు రప్పించడమే కీలకం

ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని హామీలు గుప్పించినా ఓటరును పోలింగ్‌ బూత్‌ వరకు సానుకూల ఆలోచనతో నడిపించిన పార్టీదే గెలుపు జెండా. దీనికోసం ఒక పార్టీ ఒక్కో బూత్‌కు నగరవాసులు కాని ఒక ఎంపీటీసీ/సర్పంచి, నలుగురు గ్రామ పంచాయతీ/పురపాలక సంఘాల వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ కమిటీలు వేసింది. పది బూత్‌లకు ఒక నాయకుడిని నియమించింది. వీరందరిపై పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్యే/నియోజకవర్గ బాధ్యులకు అప్పగించింది. స్థానిక కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోయినా, ప్రత్యర్థి నాయకుల వలలో పడినా ఇతర ప్రాంత కార్యకర్తల నిఘా, ప్రచారం కలిసి వస్తాయనేది ఆ పార్టీ వ్యూహం. అనుమానం ఉన్న డివిజన్ల బాధ్యతలను ఆ పార్టీ కొందరు క్రియాశీలక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగించింది. మరొక పార్టీ స్వచ్ఛంద కార్యకర్తలు, అనుబంధ సంఘాల శ్రేణులను రంగంలోకి దింపింది. స్థానిక బూత్‌ కమిటీలకు అదనంగా 50 బూత్‌లకు ఒకటి చొప్పున ఇతర ప్రాంత నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకుంది. మరొక పార్టీ స్థానిక బూత్‌ కమిటీలకు జిల్లాల నాయకులను బాధ్యులుగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తోంది.

ఓటు చేజారకూడదని...

గోల్కొండ ప్రాంతంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన కార్పొరేటర్‌ అభ్యర్థి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఈ దఫా ఎలాగైనా గెలవాలని ఆ ప్రాంతంపై నిశిత దృష్టి సారించారు. ఒక బూత్‌కు పది మంది ఇతర ప్రాంత నాయకులు, ఇద్దరు స్థానిక నాయకులు, ఇద్దరు ప్రత్యేక బాధ్యులను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన బూత్‌స్థాయి నాయకులను ముందుగానే తమవైపు ఆకర్షించి, ఓట్లు సాధించాలని ఓ పార్టీ వ్యూహం పన్నింది. ఈసీఐఎల్‌ ప్రాంతంలోనూ ఒక పార్టీ ఇదే తరహాలో ప్రత్యర్థి పార్టీల బూత్‌ నాయకులకు గాలం వేస్తోంది. స్థానికేతర బృందాలతో ఓటర్లకు ముందుగానే తాయిలాలు పంచేందుకు మరో పార్టీ తమ నియోజకవర్గాల బాధ్యులకు ‘సరఫరాలు’ చేపట్టినట్లు తెలిసింది.

Last Updated : Nov 28, 2020, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details