కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై లోతుగా అధ్యయనం చేస్తోన్న ‘కాగ్’ సంబంధిత ఇంజినీర్ల నుంచి సమగ్ర సమాచారం కోరింది. ఇంజినీర్లు ఇచ్చే సమాధానాలను పరిశీలించి మళ్లీ అదనపు సమాచారం అడగడం, ప్యాకేజీల వారీగా ఒప్పందాలు, ఆమోదించిన డిజైన్లు, తర్వాత జరిగిన మార్పులు, విద్యుత్తు ఖర్చు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు అనేక ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకపోవడం, అధిక మొత్తంలో రెవెన్యూ ఖర్చు, ఆర్థిక నిర్వహణ ఇలా అనేక అంశాలు కాగ్ పరిశీలనలో ఉన్నాయి. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం.
ఎల్లంపల్లి నుంచి అదనంగా 1.1 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఒక్కొక్కటి 3.6 మీటర్ల డయాతో పది వరుసల పైపుల నిర్మాణం చేపట్టారు. దీని ప్రకారం మొత్తం 36 మీటర్ల డయా అయ్యింది. అయితే మొదటి దశలో 1.9 టీఎంసీల నీటిని మళ్లించడానికి ఒక్కొక్కటి పది మీటర్ల డయాతో రెండు సొరంగమార్గాలు తవ్వారు. అదనపు టీఎంసీ పనిలో ఇంత ఎక్కువ డయా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అదనపు టీఎంసీ పని ద్వారా మళ్లించే నీటిని.. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు కృష్ణా బేసిన్‌లోని పంటలకు సరఫరా చేయడానికి అని పేర్కొన్నారని, అయితే ఎంత ఆయకట్టుకు ఇచ్చేది వివరాలు ఇవ్వాలని కోరింది.