తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయంత్రం 4గంటలకు మంత్రిమండలి సమావేశం - ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

పట్టణప్రాంతాల రూపురేఖలు మార్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలే ప్రధాన అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పల్లెప్రగతి తరహాలో పట్టణ ప్రగతి నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీరాజ్ సమ్మేళనాల నిర్వహణ... బడ్జెట్ సమావేశాల ప్రారంభం.... కేంద్రప్రభుత్వ బడ్జెట్ ప్రభావం తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

సాయంత్రం 4గంటలకు మంత్రిమండలి సమావేశం
సాయంత్రం కేబినెట్​ భేటీ

By

Published : Feb 16, 2020, 5:09 AM IST

Updated : Feb 16, 2020, 5:19 AM IST

హైదరాబాద్​ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు రాష్ట్రమంత్రివర్గం సమావేశం కానుంది. పట్టణ ప్రగతి నిర్వహణపైనే.. సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతూ పరిశుభ్రత వెల్లివిరిసేలా నియంత్రిత పద్ధతిన అభివృద్ధి జరిగేలా ఇప్పటికే రెండుదఫాలుగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. పురపాలక ఎన్నికలు పూర్తైన తరుణంలో అదేతరహాలో పట్టణప్రగతి నిర్వహించేందుకు రంగం సిద్ధంచేసింది. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతోపాటు అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

సాయంత్రం 4గంటలకు మంత్రిమండలి సమావేశం

కలెక్టర్లకు సీఎం మార్గనిర్ధేశం

ఇవాళ జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పట్టణ ప్రగతి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ప్రతినెల హైదరాబాద్‌కు 78కోట్లు, ఇతర పట్టణాలు, నగరాలకు 70 కోట్లు నిధులు విడుదల చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థలపై అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని.. వారికి ఇతర విధులు అప్పగించవద్దని స్పష్టంచేశారు. ఈ తరుణంలో వీలైనంత త్వరగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమ విధివిధానాలు సహానిర్వహణా తేదీలను ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి... మంత్రివర్గ సహచరులకు మార్గనిర్ధేశం చేయనున్నారు.

అదనపు కలెక్టర్ల నియామకంపై చర్చ

బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గ భేటీలోచర్చించే అవకాశం ఉంది. వచ్చేనెల తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తరెవెన్యూ చట్టం అంశంపైనా భేటీలో ప్రస్తావనకు వచ్చేఅవకాశం ఉంది. సంయుక్త కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించడంతోపాటు స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియమించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది.

కొత్త బడ్జెట్​పై మంత్రులకు దిశానిర్ధేశం

రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా ఈచ్‌వన్‌టీచ్ వన్ కార్యక్రమంపైనా మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది. పల్లెప్రగతి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజననిరక్షరాస్యుల వివరాలు సేకరించిన సర్కారు..పట్టణాలు, నగరాల్లో పట్టణప్రగతి సమయంలోనూ ఆ వివరాలు సేకరించే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్ రానున్నందున ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు తీరుపైనా మంత్రివర్గ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది.

రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక

  • నీటిపారుదల ప్రాజెక్టులు, రెండు పడకల గదుల ఇండ్లు, మిషన్ భగీరథ తదితరాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లకు సంబంధించి స్పష్టత వచ్చింది.
  • రాష్ట్రంపై కేంద్ర బడ్జెట్ ప్రభావం సహా ఇతర అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. వాటితో పాటు ఇతర రాజకీయ, తాజా అంశాలు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ ప్రచారం

సీఎం కేసీఆర్‌ సోమవారం 66వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దానికి ఒకరోజు ముందు మంత్రిమండలి సమావేశం జరగనుంది. అదీ హఠాత్తుగా సమావేశం ఉంటుందని ప్రకటించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదైనా కొత్త పథకాన్ని.. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. దీనిపై ఇప్పటికే సీఎం స్పష్టతనిచ్చారు. మంత్రిమండలిలోనూ రాజకీయపరమైన అంశాలేమీ ఉండవని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

గ్రామాల రూపురేఖలు మార్చే లక్ష్యం

  1. ఈనెల 25 వరకు జిల్లాలవారీగా పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
  2. ఆ తర్వాత 15 రోజులు గడువు ఇచ్చి గ్రామాల రూపురేఖలు మార్చేలక్ష్యాన్ని నిర్ధేశించాలని సీఎం ఆదేశించారు.
  3. గడువు ముగిశాక తనతోపాటు ఫ్లయింగ్‌స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తాయని తెలిపారు.
  4. ఈ తరుణంలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు, లక్ష్యాలపై ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు.
  5. రాష్ట్రంలోని నీటిపారుదల వ్యవస్థను.. 11 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
  6. కాళేశ్వరం నుంచి 530 టీఎంసీల నీటిఎత్తిపోత వ్యూహం, జూరాల పునరుజ్జీవనం కోసం అదనపు జలాశయ నిర్మాణం, ఇతర నీటిపారుదల అంశాలతో పాటు పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గం భేటీలో చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Feb 16, 2020, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details