పోడుభూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో... ఇదే అంశంపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) భేటీ అయింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) సమావేశమైంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి నివేదిక ఉపసంఘం ఇవ్వనుంది.
ఆర్వోఆర్ పట్టాలు ఇచ్చిన 3లక్షల 80 వేల ఎకరాలతో పాటు మరో ఆరేడు లక్షల ఎకరాల పోడుభూములున్నట్లు సమాచారముందని నిన్న సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి సైతం ఆర్వోఆర్ పట్టాలు, రైతుబంధు ఇచ్చేందుకు కృషి చేస్తామని.... ఇందుకోసం 2005 కటాఫ్‌ను పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతామని... అవసరమైతే అఖిలపక్ష నేతలతో దిల్లీకి వెళ్లి ప్రధానిని పరిష్కరించాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ తరుణంలోనే సత్యవతి నేతృత్వంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పోడు భూముల సమస్యలపై ఉపసంఘం చర్చించింది. సమావేశం అనంతరం మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు.