నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మరోదఫా సమావేశమైంది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు, రహదార్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించిన ఉపసంఘం... భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ పెద్దఎత్తున అభివృద్ధి సాధిస్తోందని, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా భూముల విలువ భారీగా పెరిగిందని అధికారులు వివరించారు.
భూముల విలువ పెరిగింది..
సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిందని తెలిపారు. భూముల విలువ భారీగా పెరిగినప్పటికీ గత ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్ విలువల్లో ఎలాంటి పెంపుదలా లేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని అధికారులు అన్నారు. ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ చాలా మంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి లావాదేవీలతో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూముల విలువలను సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏపీ 7సార్లు..