Cabinet Sub Committee on Orphans: రాష్ట్రంలో అనాథల సంరక్షణ కోసం నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పాటు చేసే విధంగా ఈ చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అనాథల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో సబ్ కమిటీ భేటీ అయింది.
కొవిడ్ అనంతరం రాష్ట్రంలో అనాథలు ఉండకూడదనే సంకల్పంతో కేబినెట్ సబ్ కమిటీ వేసి వారికోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా వివరించారు.
వారిపై పీడీ చట్టం ప్రయోగించాలి
అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. సిగ్నళ్ల వద్ద వారితో భిక్షాటన చేయిస్తున్నారని .. అలాంటి వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని మంత్రి వర్గ ఉపసంఘం సూచించింది. భవిష్యత్‌లో ఇలా చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని అధికారులకు వివరించింది.
ప్రత్యేక ఐడీ కార్డులు
సిగ్నళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయించే వారిని గుర్తించి.. వారికి ప్రభుత్వ షెల్టర్ హోమ్స్‌లో వసతి కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపింది. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ లాంటి ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.