రాష్ట్రాన్ని పర్యావరణహితంగా, పచ్చదనం పరంగా అవసరమైన జాతీయ సగటు 33 శాతానికి చేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రుల కమిటీ వెల్లడించింది. అడవుల రక్షణ, పచ్చదనంపెంపుపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి...
ఐదేళ్లుగా అటవీ శాఖ పనితీరు, చేపట్టిన కార్యక్రమాలను మంత్రుల కమిటీకి అధికారులు వివరించారు. హరితహారం ద్వారా అడవుల లోపల, బయట కలిపి ఐదు విడతల్లో 177 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలని మంత్రులు తెలిపారు. కంపా నిధుల వినియోగంలో వచ్చిన వెసులుబాటును పూర్తిగా సద్వినియోగం చేసుకుని అటవీ పునరుజ్జీవన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.