Cabinet sub -committee meeting on Housesites: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పథకంతో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ బీఆర్కే భవన్లో సమావేశమైంది. కేటీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ, జీవో58, జీవో59 ఉత్తర్వుల కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సాదాబైనామాలు, నోటరీ డాక్యుమెంట్లు, దేవాదాయ, వక్ఫ్ భూముల్లోని స్థలాల అంశంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
2014లో లక్షా 25వేల మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 58వ ఉత్తర్వు కింద 20,685 ఇండ్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని, పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరుచుకున్న దారిద్య రేఖ దిగువన ఉన్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్న ఆయన కేటాయింపు విషయంలో పేదలే మొదట అన్న విధానంతో అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.