కొవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించింది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్ నుంచి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖర్లోపు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. పంచాయతీరాజ్, పురపాలక, విద్య, ఆరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గనిర్ధేశం చేసింది.
టీకాలతో పాటు మాస్క్‌లు తప్పనిసరి
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో టీకాలతో పాటు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, కొవిడ్ నిబంధనలను పాటించడమే ఏకైక మార్గమని మంత్రులు తెలిపారు. టీకాల ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందన్న మంత్రులు... వందశాతం లక్ష్యసాధన కోసం ఆవాసాలు , వార్డులు, సబ్ సెంటర్లు, పురపాలికలు, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. టీకాల విషయంలో వెనుకంజ వేస్తున్న వారిని మరింతగా చైతన్యవంతుల్ని చేయాలని చెప్పారు.
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..
వైద్య, ఆరోగ్య శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏరియా ఆసుపత్రుల అప్ గ్రేడేషన్, రేడియాలజీ ల్యాబ్‌లు , పాథాలజీ ల్యాబ్ , ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలు కేటాయింపు, కొత్త వైద్యకళాశాలల భవనాల నిర్మాణం, అనుబంధ ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో వెంటనే చర్చించాలని మంత్రి సూచించారు.