తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Cabinet: యాసంగి సాగే ప్రధాన అజెండాగా ఇవాళ కేబినెట్ సమావేశం - Cm kcr latest updates

యాసంగి పంటలసాగే ప్రధాన అజెండాగా... ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం (TS Cabinet) సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల అంశాన్ని కేబినెట్ తేల్చనుంది. కొత్త వేరియంట్ వెలుగు చూసిన పరిస్థితుల్లో కొవిడ్ పరిస్థితి, నియంత్రణా చర్యలపైనా సమావేశంలో చర్చించనున్నారు. పోడుభూముల సమస్య పరిష్కారం, ఉద్యోగులకు డీఏ తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది.

Cabinet
కేబినెట్

By

Published : Nov 29, 2021, 5:15 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) అధ్యక్షతన... మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం (TS Cabinet) సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ప్రస్తుత వానాకాలంలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం సహా యాసంగిలో ఎంత తీసుకుంటారో చెప్పాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్రమంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు.

యాసంగిపై...

పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదన్న కేంద్రం... ఎఫ్​సీఐ (FCI) చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా యధాతథంగా కొనుగోళ్లు చేస్తామని తెలిపింది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లు సహా యాసంగి సాగుపై మంత్రివర్గ భేటీలో... విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించనున్నారు. కేంద్రం సూచనల దృష్ట్యా... వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోంది. అన్ని అంశాలపై కేబినెట్‌(TS Cabinet)లో చర్చించి... యాసంగిలో పంటలసాగు విధానాన్ని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.

కొవిడ్ పరిస్థితులపై...

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, నియంత్రణా చర్యలు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధతను సమీక్షించనున్నారు. ఆ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిస్థితులను సమీక్షించడం, నియంత్రణా చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతానికి... కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నందున... ఆ అంశంపై సమీక్షించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.

మెట్రోపై...

కొవిడ్ కారణంగా మెట్రోరైలు(Metro Rail)కు వచ్చిన ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేలా సాయం చేయాలని ఎల్ అండ్ టీ (L&T)... రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆ విజ్ఞప్తిపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు, జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల వర్గీకరణ, నియమాకాల అంశాలు మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:Houses Shrinking: ఆ నగరానికేమైంది.. మొన్నటిదాకా వరదలు.. ఇప్పుడేమో..!

ABOUT THE AUTHOR

...view details