గతేడాదితో పోలిస్తే ఇప్పుడు డీజిల్ ధర లీటరుకు రూ.40 వరకు పెరగడంతో (rising petrol and diesel prices) చమురు మంటల్లో క్యాబ్ డ్రైవర్లు అల్లాడుతున్నారు (Cab drivers are facing financial difficulties). ఈ కష్టాల ప్రయాణం చేయలేక కొందరు డెలివరీ బాయ్‌లుగా మారుతున్నారు. ఆరేడేళ్ల కిందట ఒక్క హైదరాబాద్‌లోనే 49 వేల క్యాబ్‌లుండేవి. ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నవి ఐదారువేల వరకే ఉంటాయని క్యాబ్ యజమానుల సంఘాలు చెబుతున్నాయి. వరంగల్‌లో 130 నుంచి 80కి తగ్గాయి. బాగా ఆదాయం వస్తుందన్న నమ్మకంతో కొందరు మంచి ఉద్యోగాలు వదులుకుని, మరికొందరు భూములు, బంగారం అమ్ముకుని రాజధానిలో కార్లు నడిపించారు. ఆన్‌లైన్ బుకింగ్‌ల ఆదాయం తగ్గడం, తర్వాత కరోనా, తాజాగా డీజిల్ ధరలు వరుసగా దెబ్బతీస్తూ వచ్చాయి.
నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆంజనేయులు గతంలో ఆటోడ్రైవర్. ఏడేళ్ల కిందట హయత్‌నగర్‌కు వచ్చి రుణం తీసుకుని కారు నడుపుతున్నారు. నాలుగు కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ బండిని జప్తు చేసింది. వేలంలో బండి అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో- అతికష్టమ్మీద రూ.84 వేల అప్పు రూ.2 వడ్డీకి తెచ్చి కారు విడిపించుకున్నారు. ‘డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఆదాయం తగ్గిపోయింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి దారుణం. కరోనా, డీజిల్ ప్రభావంతో అప్పుల పాలయ్యాన’ని వాపోయారు.
ఏపీలో ప్రొద్దుటూరుకి చెందిన గణేశ్ హైదరాబాద్‌లో కారు కొని నడిపిస్తున్నారు. బుకింగ్‌లు తగ్గడం, డీజిల్ ధర పెరగడంతో ఆదాయం బాగా తగ్గి రెండు కిస్తీలు కట్టలేదు. రుణమిచ్చిన బ్యాంకు వాహనాన్ని తీసుకెళ్లింది. ఇల్లు గడవడం కష్టమవ్వడంతో ప్రైవేటు అప్పుతో బండి విడిపించుకున్నారు. అమ్మకానికి పెడితే రూ.60 వేలకు మించి రావట్లేదు. ఆ సొమ్ము పోను ఇంకా రూ.2 లక్షలు కడితేగానీ వాహనం అప్పు తీరని పరిస్థితి. ‘చావలేక బతుకున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వాహనాలు వదిలేస్తున్నారు
కిస్తీలు కట్టకపోతే ఫైనాన్స్ కంపెనీలవారు ఆగట్లేదు. బండ్లు తీసుకుపోతున్నారు. డీజిల్ ధర రూ.40 వరకు ఎగబాకడంతో ఖర్చు బాగా పెరిగింది. పలువురు క్యాబ్ ఓనర్లు స్విగ్గి, జోమాటో లాంటి వాటిల్లో డెలివరీ బాయ్‌లుగా మారిపోయారు.