హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి(63) కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్నాడు. సిటీ స్కాన్‌లో అతని గుండెలోని కరోనరీ ధమనులు పూడుకుపోయినట్లు తేలింది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో అతనికి జ్వరం, దగ్గు, ఆయాసం ఇతర సమస్యలు తలెత్తడంతో కరోనా పరీక్షలు చేశారు. వైద్యులు అనుమానించినట్లే అయింది. అతనికి కొవిడ్ నిర్ధారణ కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పెద్ద వయసుతోపాటు తీవ్రమైన గుండె సమస్య...అంతలోనే కరోనా...ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా ఆశలు వదులుకోవాల్సిందే. కానీ గాంధీ వైద్యుల చికిత్సతో 22 రోజుల అనంతరం అతను కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో గాంధీ ఆసుపత్రి నుంచి అతన్ని డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు. గుండెలో సమస్య మాత్రం అలాగే వేధించడంతో కేర్ ఆసుపత్రిలో చేరారు.
గుండెకు సంబంధించి వివిధ పరీక్షలు చేయగా...ఎల్‌ఏఎడీ కరోనరీ ధమని పూర్తిగా మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. కుడివైపు కరోనరీ ధమని బిగుసుకుపోయి పనితీరు పూర్తిగా మందగించింది. వెంటనే శస్త్ర చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని తేలడంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నామని డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ తెలిపారు. డాక్డర్ విజయమెహన్, డాక్టర్ రాజేష్, జూనియర్ సర్జన్లు డాక్టర్ బాద్రా, డాక్టర్ స్నిద్ధాతో కూడిన వైద్య బృందం అతనికి ఇటీవలే ట్రిపుల్ బైపాస్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పూర్తిగా కోలుకోవడంతో ఒకట్రెండు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని చెప్పారు. ‘కరోనాతో పోరాడి కోలుకున్న వ్యక్తికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలంటే తొలుత తీవ్ర ఆందోళన చెందాం. మరోవైపు అతని గుండె నాలాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆలస్యం చేస్తే కష్టమే. మరోసారి పరీక్షలు చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా సర్జరీ చేయాలని నిర్ణయించాం. దాదాపు పది గంటలపాటు వైద్యులు చేసిన కృషితో విజయవంతంగా ప్రక్రియను ముగించాం’ అని వివరించారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సర్జరీ సంక్లిష్టమైనప్పటికీ సవాలుగా తీసుకొని ముందుకు అడుగు వేసి విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు.
ఇదీ చదవండి:పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు