Buses become Rush on Sankranti festival: సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు పయనమవ్వగా.. వాహనాలతో హైదరాబాద్‌లోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. గురువారం నుంచి నగరవాసులు పయన ప్రారంభం కాగా నేడు భోగి పండగ కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు గత రాత్రి బయల్దేరారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 2గంటల వరకు.. పట్టణమంతా విపరీతమైన రద్దీ నెలకొంది.
నేడు భోగి కావడంతో ఏంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లలో రద్దీ అధికంగా కనిపించింది. లింగంపల్లి, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, చింతల్, జీడిమెట్ల, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ బస్‌స్టేషన్లు కిక్కిరిసి పోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ పాయింట్లు జనంతో నిండిపోయాయి. ఇతరుల ఇబ్బంది లేకుండా ప్రతిపాయింట్ వద్ద పోలీసులను నియమించారు. కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ వల్ల బస్సులు సమయానికి రాక రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
బస్సు రిజర్వేషన్ చేసుకున్న వారిది ఓ సమస్య అయితే.. పండగక్కిఊరు వెళ్ళేందుకు సిద్ధమైన రోజువారీ కూలీలది మరో సమస్య. సొంతూళ్లకి వెళ్ళేందుకు ప్రధాన బస్‌స్టేషన్లలో వేచి చూస్తున్నారు. అక్కడ బస్సులు ఉంటున్నాయి.. కానీ సీట్లు ఉండట్లేదు. డ్రైవర్లు, కండక్టర్లు సీట్లు లేవని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని బస్సుల్లో టికెట్లు రిజర్వేషన్ చేశారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా బస్సులు వేశామని అధికారులు చెబుతున్నా గంటలు గడుస్తున్నా ఒక్కటి రావడంలేదని ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.