Sankranti Festival Effect: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు భాగ్యనగరవాసులు పట్నం వదిలి పల్లెకు కదులుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో పండగ జరపుకునేందుకు స్వగ్రామాలకు కుటుంబాలతో సహా తరలిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. టోల్‌గేట్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
తెలుగువారికి అతిపెద్ద పండగల్లో ఒకటైన సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున నగరవాసులు తరలివెళ్తున్నారు. వరుసగా పండగ సెలవులు, వారాంతం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్నగర్ బస్టాండ్లు సహా ఎల్బీనగర్, ఉప్పల్, కొంపల్లి, ఈసీఐఎల్, కూకకట్‌పల్లి, ఆరాంఘర్ ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేకంగా 4233 బస్సులు నడుపుతున్నా.. అన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. బస్సుల్లో సీట్ల కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదనంగా బస్సులు నడపుతున్నా.. అవసరాలకు తగ్గట్లు సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
రైళ్లు, బస్సుల్లో సరిపోను సీట్లు దొరక్క పండగకు వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, నాంపల్లి రైల్వేస్టేషన్లు సుదూర ప్రాంతాలకు వెళ్లేవారితో రద్దీగా మారిపోయాయి. పిల్లలతో ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రైళ్లలో ఏసీ, స్లీపర్ పూర్తిగా నిండిపోగా.. జనరల్ బోగీల్లో సీట్లు దొరక్కపోయినా.. నిలబడి మరీ పండుక్కి సొంతూరు వెళుతున్నారు. ప్రత్యేక రైళ్లు వారం, పది రోజుల ముందే పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణమంతా వేలాది మందితో కిటకిటగా మారింది.