రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై పెరుగుతున్న డీజిల్ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో రూ.1.76 పైసలు పెరగడం వల్ల ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్టీసీకి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిపోయాయి. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లో 9వేల 754 బస్సులు ఉన్నాయి.
వీటిలో 6వేల 579 ఆర్టీసీ బస్సులు, 3వేల 175 అద్దె బస్సులు ఉన్నాయి. డీజిల్‌పై ఆర్టీసీకి ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితర పన్సులు కలిపి గుదిబండగా మారిపోయాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జీతాలు రెండు వారాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. ఇప్పుడు రోజు రోజుకు డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఎప్పుడు ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఆర్టీసీకి డీజిల్‌పై వేసే ట్యాక్స్‌ను మినహాయించాలని దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.