ప్రకాశం జిల్లాలో పుట్టిన ఒంగోలు జాతి పశువులు జిల్లాతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల్లోనూ రోజురోజుకు తగ్గుతున్నాయి. 2012 పశుగణన ప్రకారం ఏపీలో ఒంగోలు జాతి పశువులు 5.79లక్షలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు లక్షలకు చేరుకుందని ఒక అంచనా. ఒక ప్రకాశం జిల్లాలోనే 2012లో ఒంగోలు జాతి ఆవులు, దూడలు, ఎద్దులు కలిపి 72వేలు ఉండేవి. 2017కు వచ్చే సరికి ఆసంఖ్య 64వేలకు పడిపోయింది.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడం.. రసాయనిక ఎరువులు వాడకంతో.. పశువుల ఉపయోగం తగ్గింది. దీనికి తోడు పల్లె ప్రజలకు పాలు ప్రధాన ఆదాయం కావడంతో గేదెలు.. జర్సీ ఆవుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒంగోలు జాతి పశువుల వృద్ధికి గుంటూరు, తిరుపతి, పశు పరిశోధనా కేంద్రాల ద్వారా పిండమార్పిడి, నాణ్యమైన వీర్యాన్ని సరఫరా చేయడం వంటి చర్యలకు కృషి జరుగుతోంది.
"ప్రకాశం జిల్లా చదలవాడలోని పశుక్షేత్రంలో ఒంగోలు జాతి పశువుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.. ఏటా పదుల సంఖ్యలో ఉత్పత్తితో ఆశించిన మేరకు వృద్ధి జరగడంలేదు. వాటి సంఖ్యను పెంచడానికి చర్యలు చేపడుతున్నా రైతుల నుంచి కూడా ఆధరణ ఉండటం లేదు."