Bulk drug industries: రాష్ట్రంలో మూడొందల బల్క్ డ్రగ్ పరిశ్రమలు! - telangana news 2021
కరోనా సృష్టించిన అలజడితో రాష్ట్రంలో భారీగా బల్క్‌డ్రగ్ పరిశ్రమలు ఏర్పడనున్నాయి. గతేడాది వ్యవధిలోనే 307 వరకు పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే.. రానున్న రోజుల్లో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రాష్ట్రంలో మూడొందల బల్క్ డ్రగ్ పరిశ్రమలు!
By
Published : Jul 9, 2021, 8:46 AM IST
రాష్ట్రంలో బల్క్‌డ్రగ్ పరిశ్రమలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 267 పరిశ్రమలు ఉంటే.. గత ఏడాది వ్యవధిలోనే భారీగా 307 వరకు దరఖాస్తులు వచ్చాయి. కొవిడ్ సంక్షోభ నేపథ్యంలో ఔషధాల తయారీలో వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పరిశ్రమలకు కీలక మినహాయింపు కల్పించింది. ‘ప్రజాభిప్రాయ సేకరణ’ లేకుండా పర్యావరణ అనుమతులిచ్చేలా వెసులుబాటు ఇచ్చింది. ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒక్కో బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు కనీసం రూ.10-20 కోట్లు అవసరమని.. అనుమతి పొందిన మూడొందల పైచిలుకు పరిశ్రమలు ఏర్పాటైతే రూ.3 వేల నుంచి 6 వేల కోట్ల వరకు పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్ కల్లోలంలో కీలక వెసులుబాటు..
బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే భూమి, పర్యావరణ అనుమతులు, పరిశ్రమలు, అగ్నిమాపక, పురపాలక, ఔషధ నియంత్రణ, కార్మిక, పంచాయతీరాజ్ తదితర శాఖల నుంచి అనుమతి పొందాలి. వీటిలో అత్యంత కీలకమైంది పర్యావరణ అనుమతి. ఇది లభిస్తేనే అడుగు ముందుకు పడుతుంది. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పరిశ్రమ స్థాయి, ఔషధాల ఉత్పత్తిని బట్టి ఏ, బీ, బీ2 కేటగిరీలుగా వీటిని వర్గీకరిస్తారు. ‘ఏ’ కేటగిరీ వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి, ‘బీ’ కేటగిరి వాటికి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. వీటికి ప్రజాభిప్రాయసేకరణ తప్పనిసరి. ‘బి2’ కేటగిరీకి పబ్లిక్ హియరింగ్ అవసరం లేదు. కొవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్ పరిశ్రమల్ని బి2 విభాగంలో చేర్చింది. దీంతో పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
సమీప జిల్లాల్లో అధికం..
బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా మెదక్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కామారెడ్డి.. హైదరాబాద్‌కు సమీప జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికే పెద్దసంఖ్యలో పరిశ్రమలున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తవాటికి అనుమతి లేదు. దీంతో దగ్గర జిల్లాలను పారిశ్రామికవేత్తలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మారంగంలో పేరున్న అరడజనుకు పైగా కంపెనీలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇప్పటివరకు ఇతర రంగాల్లో ఉన్నవారు కొత్తగా ఫార్మారంగంపై ఆసక్తి చూపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు పదార్థాలకు సంబంధించిన ఓ సంస్థ కూడా బల్క్‌డ్రగ్‌లో రెండు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చి దరఖాస్తు చేసింది.