వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించేందుకు శాసనసభ, శాసనమండలి ఈ నెల 15 నుంచి సమావేశం కానున్నాయి. ఈ మేరకు ఉభయసభలను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సభామందిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం రెండు సభల సభావ్యవహారాల సంఘాలు సమావేశమై.... బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేస్తాయి. పదిరోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యుడు, దివంగత నోముల నర్సింహయ్యకు 16న అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం 17వ తేదీన ఉండే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18న ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
తుది కసరత్తు పూర్తయ్యాక కేటాయింపులు
బీఏసీలో ఖరారు చేసే ఎజెండా ప్రకారం బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులు, ద్రవ్యవినిమయబిల్లుపై చర్చతో పాటు ఇతర బిల్లులు, అంశాలపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తైంది. వార్షికపద్దుకు సంబంధించిన కేటాయింపుల విధివిధానాలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు... ఆయా శాఖల ప్రతిపాదనలపై సమీక్షించారు. బడ్జెట్‌పై సీఎం తుది కసరత్తు పూర్తయ్యాక కేటాయింపులు ఖరారవుతాయి. అనంతరం, ఈ నెల 16 లేదా 17 తేదీల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, ప్రాధాన్యతా రంగాలకు తగిన నిధులతో పాటు హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు.