Telangana Budget 2022-23: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తి చేసిన ఆర్థికశాఖ.. ప్రతిపాదనలను పరిశీలించింది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా.. ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2 లక్షలా 30 వేల కోట్ల భారీ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మార్చి వరకు ప్రభుత్వం చేసే వ్యయం లక్షా 80 వేల కోట్లు దాటుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి బాగానే ఉంది. సొంత ఆదాయం అంచనాలను పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Telangana Budget Session : స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్లు అంచనా వేయగా.. ఇప్పటికే 10,500 కోట్లు వచ్చాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల రాబడి 15 వేల కోట్లు దాటవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలు అధిగమించవచ్చని అధికారులు అంటున్నారు. వాణిజ్య పన్నుల రాబడి బడ్జెట్ అంచనాలను అధిగమించనుంది. జీఎస్టీ, అమ్మకం పన్ను పెరుగుదల బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత పన్నుల ఆదాయం మంచిగా ఉండటం సహా ఇతర మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
32 వేల కోట్ల అంచనా..
Telangana Budget Sessions : భూముల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.20 వేల కోట్లు అంచనా వేస్తే.. ఇప్పటి వరకు 5 వేల కోట్ల లోపుమాత్రమే వచ్చింది. ఐతే భూముల అమ్మకానికి ఉన్న అడ్డంకులు ఇటీవలే తొలగిపోవడంతో.. వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికి విక్రయించిన భూములకు రికార్డు ధర రావడం, స్థిరాస్తి రంగం జోరుతో భూముల విక్రయం ద్వారా భారీ రాబడిని ఆశిస్తున్నారు. కేంద్ర పనుల్లో వాటా, గ్రాంట్ల కింద 2022-23లో రాష్ట్రానికి 32 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.