BSP Telangana Election Campaign 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే.. సోమవారం హైదరాబాద్ వేదికగా బీఎస్పీ ఎన్నికల నగారా మోగించింది. పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం 17వ వర్థంతిని పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సంస్మరణ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఎంపీ రాంజీగౌతం, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) పాల్గొన్నారు.
BSP Focus on Telangana Assembly Elections 2023 :తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. తొలుత లక్డీకపూల్‌లోని ఆ పార్టీ కార్యాలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు.. భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. త్వరలో మిగతా శాసనసభ స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఇతర 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఊరూరా తిరుగుతూ తమను గెలిపించి అసెంబ్లీ పంపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
'మౌనమే అంగీకారమా?.. విచారణ ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది?'
రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గల బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా.. పార్టీ పోరాడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాన్షీరాం (Kanshi Ram) భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పిన రాజకీయ యోధుడని.. భవిష్యత్ తరాల బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న మహనీయుడని అన్నారు. ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయారని తెలిపారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన కుటుంబాలపై దాడులు జరుగుతుంటే ఆయా వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రోద్భలం, ఒత్తిడితోనే.. వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు కొండ చిలువలు, చలిచీమల మధ్య జరుగుతుందని బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.