Bahujan Rajyadhikara Yatra: నిరుద్యోగ యువత, అణగారిన వర్గాల అభ్యున్నతి, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా... బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభమైంది. ముందుగా సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున బహుజన సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అక్కడి నుంచి జనగామ జిల్లా ఖిలాషాపూర్ బయలుదేరారు.
భావోద్వేగంతో ఆర్ఎస్
అంతకుముందుగా ఇంటి నుంచి బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కుటుంబీకుల నుంచి వీడ్కోలు తీసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నానన్న భావన.. ఆయనను ఉద్వేగానికి గురిచేసింది. వారిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. 300 రోజుల పాటు కుటుంబంతో ఉండే అవకాశం లేదన్న భావన ఓ వైపు కలచి వేస్తున్నా.. బహుజన రాజ్య స్థాపన ద్వారా తరాల తలరాతను మార్చే చారిత్రక అవకాశం గొప్ప అవకాశమిచ్చిందని పేర్కొన్నారు.