రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారత్ స్టేజ్ ప్రమాణాలను రూపొందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఎస్- 4 నిబంధనలు అమల్లో ఉన్నాయి. తాజాగా బీఎస్-6 కాలుష్య నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బీఎస్-4 ప్రమాణాలు గల ఇంధనం వల్ల వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల స్థాయిలను తగ్గించటమే బీఎస్-6 నిబంధనల ఉద్దేశం. ఇప్పటికే ఆయిల్ రిఫైనరీలు బీఎస్-6 ఇంధన ఉత్పత్తి, సరఫరాను ప్రారంభించాయి. ప్రస్తుతం చాలా బంకుల్లో బీఎస్-6 ఇంధనం లభిస్తోంది. మొదట దేశ రాజధాని దిల్లీ, ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చిన సరఫరా.. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
మైలేజీ తగ్గదు.. ఇంజిన్ పనితీరు మెరుగవుతుంది - ఏప్రిల్ నుంచి బీఎస్6 ఇందనం
కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాహనరంగంలో బీఎస్-6 రివల్యూషన్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అదే రోజు నుంచి అత్యంత శుద్ధి ఇంధనం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంధనానికి, రాబోయే ఇంధనానికి తేడాలేంటి?! వాహన మైలేజీని నూతన ఇంధనం ఏమేరకు ప్రభావితం చేస్తుంది.. రేట్లలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా వంటి అంశాలపై ప్రత్యేక కథనం.
బీఎస్-6 ఇంధనం వల్ల మైలేజీ తగ్గదని... ఇంజిన్ పనితీరు మెరుగుపరచడమే కాకుండా తక్కువ కాలుష్య ఉద్గారాలు విడుదల చేస్తుందని ఆయిల్ సంస్థలు చెబుతున్నాయి. గతంలో బీఎస్-3 వాహనాల్లో సల్ఫర్ ఉద్గారాలు 350 పీపీఎంగా ఉండగా... బీఎస్-4లో దానిని 50 పీపీఎంకు తగ్గించారు. బీఎస్-6లో పెట్రో, డీజిల్‌లో సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎంకు తగ్గనున్నాయి. ఇది సీఎన్జీ ఉద్గారాలతో సమానం. సల్ఫర్‌తో పాటు నైట్రస్ ఆక్సైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఎస్-4 వాహనాలకు నూతన ఇంధనం ఎటువంటి హానీ చేయదని పేర్కొన్నారు.
ధర మాటేమిటి..?
రేట్ల విషయంలో మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నూతన ఇంధనం తయారు చేసేందుకు రూ.35 వేల కోట్లతో తమ రిఫైనరీలను అప్ గ్రేడ్ చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భారాన్ని రిఫైనరీ సంస్థలే భరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా నూతనంగా వస్తున్న ఈ పర్యావరణ హిత విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... ఇంధన రేట్లు పెంచేందుకు సుముఖంగా లేదు. ప్రస్తుతం విధానంలోనే రోజువారీ మార్పులు ఉంటాయి.