తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మత కోణంలో చూడొద్దని.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆన్లైన్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో భాజపా, ఆరెస్సెస్ సామాజిక విభజనకు కుట్రలు పన్నుతున్నాయని.. సాయుధ పోరాట స్ఫూర్తితో ఆ కుట్రలను అందరం కలిసి తిప్పి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. సాయుధ పోరాటం సమాజంలో మహిళల పాత్రను సమున్నతంగా నిలబెట్టిందని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా.. ఇప్పటికీ భూ సమస్యలు అలాగే ఉన్నాయని.. భూమిపై ఆనాడు పెత్తందారులు, నేడు పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతుందని దుయ్యబట్టారు.
తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్
భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్‌లు కలిసి దేశంలో సామాజిక విభజనకు కుట్రలు పన్నుతున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో ఆ కుట్రలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచాచారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆన్లైన్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పరిపాలనలోని వైఫల్యాలను సరిదిద్దుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. గతంలో బుర్ర మీసాలతో ఉండి కిర్రు చెప్పులేసుకుని తిరిగే భూస్వాముల స్థానంలో.. నేడు ప్యాంటు, షర్టు వేసుకుని కార్లలో తిరిగే భూస్వాములు వచ్చారన్నారు. వీరందరూ కేసీఆర్‌కు కనబడటం లేదా అని ప్రశ్నించారు. భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఏ వ్యక్తికి 54 ఎకరాలకు మించి ఉండకూదని గుర్తు చేశారు. కానీ అంతకుమించి వందల, వేల ఎకరాలున్న భూస్వాములు నేడు లేరా అని తమ్మినేని ప్రశ్నించారు. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ తనకు 179 ఎకరాలు ఉందంటూ చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వారందరికీ రైతుబంధు కింద డబ్బులు రావటం లేదా? అని నిలదీశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక్క రోజులో రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్... సమగ్ర భూ సర్వేపై ఎందుకు దృష్టి సారించటం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ పేరిట సాధారణ, పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు వేసేందుకు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు.