BRS Unsatisfied Leaders : టికెట్ల కేటాయింపుపై బీఆర్ఎస్లో ఆగని అసంతృప్తి.. అభ్యర్థిని మార్చాలని పలుచోట్ల డిమాండ్లు BRS Unsatisfied Leaders Issues For MLA Tickets :భారత రాష్ట్ర సమితిలో అభ్యర్థుల ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి కొనసాగుతూనే ఉంది. సిట్టింగులకు దక్కిన చోట ఇతర ఆశావహులు.. మార్చిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగులుతున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అభ్యర్థిని మార్చాల్సిందేనని లేకపోతే సహకరించేది లేదని భీష్మిస్తున్నారు. అధిష్ఠానం కనీసం పిలిచి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి గళం విప్పారు. ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న తనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని.. ఇప్పటికైనా అధిష్ఠానం పిలిచి తనతో మాట్లాడతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
"23 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన, హైదరాబాద్ రంగారెడ్డి నియోజకవర్గాల్లో ఏకైక ఉద్యమాకారుడిని నేను. నాకు ఎందుకు అన్యాయం చేశారు. నేను ఏం చేశానని నాకు టిెకెట్ ఇవ్వలేదు కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు. ఉరి వేసేముందు కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు మాకు అది కూడా చేయలేదు. నన్ను తీసేయడానికి కారణం ఏంటి." - భేతి సుబాష్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
BRS MLA Tickets Issues : పటాన్‌చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న నీలం మధు ముదిరాజ్‌ను మంత్రి హరీష్‌రావు.. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి తనకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను మధు కోరారు. ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాలేరు టికెట్ సిట్టింగ్ శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డికే ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల బలప్రదర్శన చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావును పంపించి బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ససేమిరా అన్న తుమ్మల... ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకే టికెట్ దక్కడంతో.. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జలగం వెంకట్రావు, మధిరలో లింగాల కమలరాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వడంపై సీనియర్ నేత బొమ్మెర రామ్మూర్తి అసంతృప్తితోనే ఉన్నారు.
MLA Rajaiah Latest Comments : 'ఆరు నూరైనా.. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో ఉంటా..' ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
Ticket Issue in Kodad : కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా సీనియర్ నేతలు చందర్‌రావు, శశిధర్ రెడ్డి అసమ్మతి బావుటా ఎగురవేశారు. మల్లయ్య యాదవ్‌ను మార్చాల్సిందేనని భీష్మించుకున్నారు. దేవరకొండలో రవీంద్రనాయక్ పై మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నరసింహా, మాజీ ఛైర్మన్ దేవేంద్ర నాయక్ వర్గీయులు భగ్గుమంటున్నారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌ను మార్చాలంటూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, జెట్పీటీసీలు, యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ రాజకీయాలు శాంతించడం లేదు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసంతృప్తితో రగిలి పోతున్నారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను మార్చాలంటూ ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ములుగులో నాగజ్యోతికి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
Uppal MLA Subhash Reddy Reaction on Non-Allocation of MLA Ticket : నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి: ఉప్పల్ ఎమ్మెల్యే
ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినా అసంతృప్తి:వేములవాడలో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినప్పటికీ.. నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు ఆరడం లేదు. అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహా రావు, చెన్నమనేని రమేష్ వర్గీయులు ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం, మంథనిలో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్న నేతల అసంతృప్తి చల్లారడం లేదు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ పోటీ చేయనుండగా.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖా నాయక్ టికెట్ కోసం కాంగ్రెస్‌కు దరఖాస్తు చేసుకోవడంతో.. ద్వితీయ శ్రేణి కేడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. బోధ్‌లో అనిల్ జాదవ్‌కు టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, మాజీ ఎంపీ నగేశ్ అలక వహించారు.
Ticket Issue of Mynampally : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారంపై స్పష్టత రాకపోవడంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో మల్కాజిగిరిలో మైనంపల్లిని మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ.. బీఆర్ఎస్ నుంచి స్పష్టత రాకపోవడంతో మార్పు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మైనంపల్లి హన్మంతరావు కూడా ఇటీవల తన మద్దతుదారులతో సమావేశమై.. పది రోజుల్లో కార్యచరణ ప్రకటిస్తామన్నారు. మెదక్‌లో తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి హన్మంతరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నర్సాపూర్‌లో టికెట్ కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డికి.. మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. తనకే టికెట్ దక్కుతుందని సునీత లక్ష్మారెడ్డి ధీమాతో ఉండగా.. ఈసారి పోటీలో ఉండేది తాననేని మదన్ రెడ్డి చెబుతున్నారు. అంబర్‌పేట టికెట్ ఆశించిన మాజీ మంత్రి సి. కృష్ణాయాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ముషీరాబాద్, జూబ్లీహిల్స్, తదితర నియోజకవర్గాల్లో కొందరు నేతలు అలక వహించి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
కేటీఆర్ వచ్చాక వారితో చర్చలు:అభ్యర్థిని ప్రకటించేటప్పుడు కనీసం తమను సంప్రదించ లేదని చాలా మంది అసంతృప్త నేతల వాదన.. ఆవేదన. కనీసం తర్వాతయినా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తమను పిలిచి చర్చించి భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం లేదని తమ సన్నిహతుల వద్ద వాపోతున్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత అసంతృప్త, అసమ్మతులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో పరిస్థితులపై బీఆర్ఎస్ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. అభ్యర్థిపై ప్రజల అభిప్రాయం, అసంతృప్తి ఏస్థాయిలో ఉంది.. వాటి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది.. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపుల్లో ఉన్నారా.. ఎలా ఉంటాయి తదితర అంశాలపై నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి'
BRS MLA Ticket Issues Telangana : అధికార పార్టీలో పెరుగుతోన్న అసమ్మతి గళం.. టికెట్ల కోసం ఆగని అసంతృప్త నేతల పోరాటం