BRS Telangana Election Plan 2023: మళ్లీ ఎన్నికల వ్యూహాలకు.. బీఆర్ఎస్ పదనుపెట్టింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై రకరకాల ఊహాగానాలు రావడంతో కొన్నిరోజులుగా నిశ్శబ్దంగా ఉన్న గులాబీ పార్టీ.. మళ్లీ వేగం పెంచింది. అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలల నుంచే క్రియాశీలకంగా వ్యవహరించింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలుపడొచ్చునని భావిస్తున్న బీఆర్ఎస్ అందుకు అనుగుణంగా కార్యక్రమాల్లో వేగం పెంచింది. అభ్యర్థుల ప్రకటనతో వివిధ ప్రాంతాల్లో భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్తిపై బీఆర్ఎస్ తొలుత దృష్టిసారించింది. మంత్రులు, జిల్లాలోని ముఖ్యనేతలతో ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేయగా.. నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగారు.
MLA Thatikonda Rajaiah Vs MLC Kadiyam Srihari :స్టేషన్ ఘన్‌పూర్‌లో వర్గాలుగా విడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అభ్యర్థి కడియం శ్రీహరిని.. కేటీఆర్ పిలిపించి మాట్లాడి సయోధ్య కుదిర్చారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు హామీ ఇచ్చి.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని కడియం శ్రీహరికి సూచించారు. జనగామ నేతలతో కేటీఆర్ చర్చించారు. ఇంకా అభ్యర్థిని ప్రకటించని జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం కేసీఆర్ ఇద్దరని పిలిచి మాట్లాడినట్లు సమాచారం.
వేములవాడలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను ఇప్పటికే సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడి.. కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవిలో నియమించారు. చెన్నమనేని వర్గానికి చెందిన పలువురు నేతలను.. కేటీఆర్ పిలిచి బుజ్జగించారు. కల్వకుర్తి, ఉప్పల్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన.. అసంతృప్తి నేతలతో నేడో, రేపో కేటీఆర్ చర్చించనున్నారు.
BRS MLA Candidates List 2023 :అభ్యర్థుల తుదిజాబితాను అతిత్వరలో ప్రకటించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లితోపాటు మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని త్వరలో ఖరారు చేయనున్నారు. జనగామ నేతలను పిలిచి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకత్వం.. పల్లా రాజేశ్వర్ రెడ్డికే దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌లో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి వైపే బీఆర్ఎస్ మొగ్గు చూపుతోంది. ఐతే మళ్లీ అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పట్టుబట్టుతున్నందున.. ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గ నేతలతో..కేసీఆర్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.