BRS Protests Across Telangana: రాష్ట్రంలో రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రభుత్వం రూ.151 కోట్ల ఉపాధి హామీ నిధులతో కల్లాలు నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన నిధులను.. తిరిగి ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. నిర్మల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వడ్లకుప్పలు రోడ్డుపై పోసి ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తా పాల్గొన్నారు. రైతు కల్లాల విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తావద్ద పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం:నారాయణపేటలో బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేయద్దని నినాదాలు చేశారు. వనపర్తిలోని రాజీవ్‌కూడలి వద్ద నిర్వహించిన ఆందోళనలో భారీగా పార్టీశ్రేణులు పాల్గొన్నారు. కేంద్రం తన నోటీసులను వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఖమ్మంలో ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే .. కేంద్రం కుట్రసు చేస్తోందని ఎమ్మెల్సీ ఆరోపించారు.