BRS Fires On Revanth Comments : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అంశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత్ రాష్ట్ర సమితి ధర్నాను.. కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. అరెస్టులకు దారి తీసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులకు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అని రేవంత్‌రెడ్డి మాట్లాడడం దారుణమని ఆమె అన్నారు.
బెల్లంపల్లిలోని కన్నాల జాతీయ రహదారిపై.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లతో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని సబ్‌స్టేషన్ వద్ద రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లాలోని సబ్‌స్టేషన్ల ముందు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. భువనగిరి ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసనలో స్థానిక ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలను తీర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధాన్యం అమ్ముకోవడానికి గతంలో అన్నదాతలు.. ఎన్నో కష్టాలు పడేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్షకులకు ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం, గ్రామాల్లో ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి.. వడ్లు కొనుగోళ్లు చేస్తున్నామని.. డబ్బులు కూడా వెంటనే అందుతున్నాయని శేఖర్‌రెడ్డి వివరించారు.