తెలంగాణ

telangana

ETV Bharat / state

విస్తరణపై బీఆర్​ఎస్​ గురి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధత - తెలంగాణ తాజా వార్తలు

BRS Preparing for Loksabha Elections : టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెందిన బీఆర్ఎస్ జాతీయస్థాయిలో విస్తరణ కోసం తెలుగు ప్రజలు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీకి సమాయత్తం అవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచార సేకరణతో పాటు అభ్యర్థులను సన్నద్ధం చేసే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

BRS Preparing Lok Sabha Elections
BRS Preparing Lok Sabha Elections

By

Published : Dec 28, 2022, 6:55 AM IST

BRS Preparing for Loksabha Elections : వచ్చే ఏడాది తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 2024 మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేయడం సాధ్యం కానందున ముందుగా తెలుగు ప్రజలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో పోటీ చేసి, ఓట్లు, సీట్లు పొందడమే ధ్యేయమని బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సభలో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఆయన ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ, ఏపీలు గాక తెలుగు ప్రజలు ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారనే సమాచారం తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక సమాచారం సేకరించారు. తెలంగాణ, ఏపీ తర్వాత ఎక్కువ మంది కర్ణాటకలో ఉన్నట్లు బీఆర్ఎస్​కు సమాచారం అందింది.

కర్ణాటక జనాభాలో దాదాపు 15% మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నారు. బీదర్‌, కలబురగి, కోలార్‌, బళ్లారి నాలుగు జిల్లాల్లో దాదాపు 30% మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. బెంగళూరు నగరం, గ్రామీణంలో వరుసగా 49%, 65% తెలుగు మాట్లాడేవారు ఉండగా, కోలార్‌, బళ్లారి, రాయచూర్‌లలో వరుసగా 76%, 63%, 64% మంది ఉన్నారు. 28 అసెంబ్లీ స్థానాలున్న బెంగళూరులో భారీ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కనీసం 40 శాసనసభ నియోజకవర్గాల్లో, 14 పార్లమెంటు స్థానాల్లో వీరు ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం అందింది. మహారాష్ట్రలోనూ 22 శాసనసభ, 8 పార్లమెంటు స్థానాల్లో తెలుగు వారి ప్రభావం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మూడు ఎంపీ స్థానాలు, 12 శాసనసభ స్థానాల్లో తెలుగు వారున్నారు. దీంతో పాటు తమిళనాడు జనాభాలో 27 శాతం మంది తెలుగువారున్నారు. దాదాపు 18 పార్లమెంటు స్థానాల్లో వారి పాత్ర కీలకంగా ఉంది.

వీటితో పాటు గుజరాత్‌లో 3 లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. ఒడిశాలో 12 లక్షల మంది, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగున్నర లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 16 శాసనసభ, ఆరు పార్లమెంటు స్థానాల్లో ప్రభావం చూపనున్నారు. కేరళలో 1.2 లక్షల మంది, పుదుచ్చేరిలో 99 వేల మంది, యూపీలో 2.9 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 85 వేలు, రాజస్థాన్‌లో 72 వేల మంది తెలుగువారున్నారు.

నికరంగా తెలంగాణ, ఏపీ మినహా తెలుగు ప్రజలు ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థానాలు 30 వరకు ఉన్నట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. శాసనసభ స్థానాలకు సంబంధించి వచ్చే ఏడాది జరిగే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోటీకి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో జనతాదళ్‌-ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలోనూ కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీకి యోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక, యూపీలలో జేడీఎస్‌, సమాజ్‌వాది పార్టీలతో పొత్తుతో పోటీ చేసే వీలుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలోనూ గుజరాత్‌, తమిళనాడులలో సొంతంగా పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే తమిళనాడులోని వీసీకే పార్టీ బీఆర్ఎస్​లో విలీనానికి ముందుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీకి అక్కడి నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.

వైసీపీ వైఖరిని బట్టి ఆ రాష్ట్రంలో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కలిసిరాకపోతే పార్లమెంటు, శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా పంజాబ్‌, హరియాణా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ బీఆర్ఎస్ రైతువిభాగాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖలను ప్రారంభిస్తారు. ఆ వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details