BRS Meeting Today : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. సమావేశం ప్రారంభోత్సవానికి ముందు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సీఎం కేసీఆర్, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. ఎన్నికల ఏడాది దృష్ట్యా పార్టీ కార్యాచరణ, ప్రతిపక్షాలను ఎదుర్కోవడంపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
BRS Meeting Today in Hyderabad : భారత్ రాష్ట్ర సమితి.. పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రచార సరళి సహా పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు.
రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగా పార్టీ నాయకులపై జరుగుతున్న సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులను.. ఈ సమావేశంలో ఖండించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల తీరు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ సహా ఇతర అంశాలపై కేసీఆర్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.