Competition for MLA Tickets in BRS :ఎన్నికలకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన అధికార పార్టీలో.. టికెట్ల సందడి జోరుగా సాగుతోంది. సిట్టింగ్ శాసనసభ్యులకే మళ్లీ ఎక్కువ శాతం టికెట్లు ఇస్తామన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. పనితీరు సరిగా లేని వారిని మార్చక తప్పదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మళ్లీ టికెట్ తమకేనని ప్రస్తుత శాసనసభ్యులు ఆశిస్తుండగా.. ఈసారి తమకే అవకాశమంటూ మిగతా ఆశావహులు ప్రచారం చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 :దాదాపు ఏడాది నుంచే పలు నియోజకవర్గాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.. టికెట్ ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ముమ్మరం చేయడంతో కేసీఆర్, కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తమ బలాన్ని ప్రదర్శిస్తూ... అనుకూల అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూనే.. మరోవైపు పార్టీలో ప్రత్యర్థుల బలహీనతలను, లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సిద్ధమేనంటూ కొందరు పరోక్ష హెచ్చరికలను పంపిస్తున్నారు.
నువ్వా నేనా అనే విధంగా : గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు కొన్నిసార్లు బహిరంగంగానే బయటపడ్డాయి. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు వర్గాలుగా ఏర్పడి బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటా పోటీగా నువ్వా నేనా అనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్ కూడా ఇక్కడ రెండు వైపులా చీలిపోయారు.
BRS Focus on Telangana Assembly Elections : ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్య పోటీ కొన్ని సందర్భాల్లో శృతిమించి కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. గతంలో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ కూడా వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బదులుగా తనకు లేదా తన కోడలికి ఇవ్వాలని.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
BRS Party Latest News :రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మహేశ్వరం లేదా రాజేంద్రనగర్‌లో తనకు అవకాశం ఇవ్వాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ హ్యాట్రిపై ధీమాతో ఉండగా.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బండి రమేష్ కోరుతున్నారు.
వికారాబాద్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య భగ్గు మంటోంది. మహేందర్‌రెడ్డికాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై గెలిచిన న్యాయవాది కాలేరు వెంకటేశ్ పోటీకి మళ్లీ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ముషీరాబాద్‌లో తనకు లేదా తన కుమారుడు జైసింహాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరుతుండగా.. దివంగత మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎం.ఎన్.శ్రీనివాస్ కూడా ఆశతో ఉన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న అకాల మరణంతో.. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె లాస్య నందిత కోరుతుండగా.. రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థ ఛైర్మన్ క్రిశాంక్, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పూర్తి ధీమాతో ఉండగా.. డీసీసీబీ ఛైర్మన్ బి.మనోహర్ రెడ్డి పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు.. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన క్యామ మల్లేశ్ కూడా ఆశిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు.. మళ్లీ తనకే టికెట్ అని ధీమాతో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా అదే ఆశతో ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోస్థానం నుంచి పోటీ చేస్తే.. అక్కడి నుంచి బరిలోకి దిగాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఆశిస్తున్నారు. మంచిర్యాలలో తనను కొనసాగించాలని లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ప్రస్తుత శాసనసభ్యుడు దివాకర్ రావు కోరుతుండగా.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, భారత జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Competition for MLA Tickets in BRS : ఖానాపూర్‌లో రేఖా నాయక్ ధీమాతో ఉండగా.. జడ్పీ మాజీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్.. భూక్యా నాయక్ పోటీ పడుతున్నారు. బోథ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావుతోపాటు మాజీ ఎంపీ నగేశ్, జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ ప్రయత్నిస్తున్నారు. ముథోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితోపాటు.. వేణుగోపాల్ ఆశిస్తున్నారు.