BRS party athmiyasammelanam in Telangana: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రజల మధ్య విభేధాలు సృష్టించి వారి మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు తెలియజేశారు.
రైతుల కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తే...అదానీ కోసం మోదీ ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. 12వేల కోట్ల రూపాయల అదానీ అప్పు మాఫీ చేసిన భాజపా ప్రభుత్వం, 4వేల కోట్లతో రైతుల వడ్లు కొనలేకపోయిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేటలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీశ్... కర్షకులకు కష్టం రాకుండా ముఖ్యమంత్రి ఆదుకుంటారని తెలిపారు.
"మోదీ అదాని కోసం ఆలోచన చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12వేల కోట్ల రూపాయలు అదానీ అప్పు ఎగబెడితే బీజేపీ ప్రభుత్వం అదానీకి అప్పు మాఫీ చేసింది. వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వారు మేము వడ్లు కొనము. ఎండాకాలం వడ్లు నూకలు అయితాయని చేతులెత్తేసింది. అదానీకి 12వేల కోట్ల రూపాయలు మాఫీ చేయవచ్చు కానీ 4వేల కోట్లు పెట్టి రైతుల వడ్లు కొనమంటే చేతకాదా. ప్రభుత్వం ఎవరికోసం ఆలోచన చేస్తుంది. దిల్లీ వాళ్లు వడ్లు కొనకపోయిన మన కేసీఆర్ మనకున్నారు. ఊరూరా కాంటలు పెట్టి వడ్లు కొంటాం, మూడు రోజులలో అకౌంట్లలో పైసలు వేస్తాము. రైతునెప్పుడు కూడా కేసీఆర్ కిందకి రానివ్వరు."_హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి