Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిల పేర్లు ప్రస్తావించింది. వీరితోపాటు ఈ మొత్తం వ్యవహారంలో అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై పోషించిన పాత్రల గురించి పేర్కొంది. మద్యం కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా.. అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000పేజీల ఛార్జిషీట్‌లో అనేక విషయాల వెల్లడించింది.
స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఛార్జిషీట్: ఇప్పటివరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి ద్వారా తీసుకున్న స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మాగుంట రాఘవ్ రెడ్డి, కవితలు అసలు భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ 14,05,58,890 బాటిళ్ల మద్యం విక్రయించి.. రూ.1,028 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది.
రూ.100 కోట్ల ముడుపులు: మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ రెడ్డి, శరత్‌రెడ్డి, కె. కవిత నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్.. రూ.100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతల కోసం విజయ్ నాయర్‌కు ఇచ్చినట్లు పేర్కొంది. సౌత్ గ్రూప్ - ఆప్ నేతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ముడుపులను ముందస్తుగా చెల్లించినట్లు తెలిపింది. అందుకు ప్రతిఫలంగా సౌత్ గ్రూపునకు అవాంఛిత ప్రయోజనాలు కల్పించినట్లు పేర్కొంది. ముడుపుల రూపంలో ఇచ్చిన రూ.100 కోట్లు రాబట్టుకునేందుకు వీలుగా.. ఇండో స్పిరిట్ సంస్థలో 65 శాతం వాటాను సౌత్ గ్రూపుకు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.
కవిత ఇంట్లో సమావేశం:ఇండో స్పిరిట్స్‌లోని వాటాను సౌత్ గ్రూప్‌లోని పాత్రదారులైన అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో నడిపినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వివిధ పాత్రలున్న 36 మందికి చెందిన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసిన విషయాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఈ ఏడాది జనవరిలో కవితతో హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సమీర్ సమావేశం అయ్యారని ఈడీ తెలిపింది. ఈ సమావేశంలో సమీర్‌తోపాటు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత, ఆమె భర్త అనిల్ కూడా ఉన్నట్లు పేర్కొంది.