BRS MLAs on Minister Mallareddy : నామినేటెడ్ పదవులు సహా ఇతర అంశాలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెరాసలో ముసలం పుట్టించాయి. మంత్రి మల్లారెడ్డిపై జిల్లా శాసనసభ్యులు తమ అసంతృప్తి ప్రకటించారు. జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు నాలుగు గంటలకుపైగా సమావేశమై.. మంత్రి వైఖరి, తమకు, తమ నియోజకవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై సుధీర్ఘంగా చర్చించారు. దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసం భేటీకి వేదికైంది. ఆయనతో పాటు ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు సుభాశ్‌రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ సమావేశంలో పాల్గొన్నారు.
వివిధ కారణాలతో గత కొన్నాళ్లుగా మంత్రి మల్లారెడ్డితో ఈ శాసనసభ్యులకు సమస్యలున్నాయి. తాజాగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి నియామకం నేపథ్యంలో వివాదం రాజుకొంది. దీంతో ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి అందరినీ కలుపుకొని పోవడం లేదని, అధిష్ఠానం ఆదేశాలకు విరుద్ధంగా పదవులన్నింటినీ తన సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తమ తమ నియోజకవర్గాలకు ఎలాంటి పదవులు దక్కడం లేదని.. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోయారు.
సీఎం చెప్పినా పట్టించుకోవట్లే..: సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదంటూనే శాసనసభ్యులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. తాము మీడియాకు సమాచారం ఇవ్వలేదని.. ఏ మంత్రి పంపారో కూడా తెలుసంటూ మల్లారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందరితో మాట్లాడాలని, అందరినీ కలుపుకొని పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే తాము సమావేశమైనట్లు తెలిపారు.