Ambedkar Jayanti 2023 : రాష్ట్రంలో అంబేడ్కర్ జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ సేవలను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో నేటి తరం నడవాలని సూచించారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. మహనీయుడి జన్మదినం రోజున రాజకీయాలు తగదని హితవు పలికారు.
Gutta Sukhender on Ambedkar : అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగిస్తున్నందునే తెలంగాణ నేడు అగ్రస్థానంలో నిలుస్తుందని శాసనసభాపతి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావించేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అని తెలిపారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ చేర్చిన నిబంధన వల్లే మనం తెలంగాణ సాధించుకోగలిగామని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 125 అడుగుల విగ్రహం నిర్మించుకున్నామని.. ఇది దేశానికి గర్వకారణమని వివరించారు.
'దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు సహా అనేక పథకాలు అమలు చేస్తూ.. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దళితుల అభ్యున్నతిని ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలతో కొందరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టమంటే కేంద్రం నుంచి స్పందన లేదు. రిజర్వేషన్లు కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తున్నారు.' - మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి