BRS stands with MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు మద్దతు తెలుపుతూ మంత్రులు స్పందించారు. ఇందులో భాగంగానే మంత్రి ప్రశాంత్‌రెడ్డి .. కవితమ్మా.. ధైర్యంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. పిచ్చి కుక్కలను వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయని.. అంత మాత్రాన వేట ఆపుతామా? అంటూ పేర్కొన్నారు. తామంతా కేసీఆర్ కుటుంబసభ్యులమని.. మీవెంటే ఉన్నామంటూ తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ ఈ ధర్మ పోరాటంలో మీతో పాటు ఉన్నారంటూ వివరించారు. ధర్మం మీ వైపు ఉందని.. అంతిమ విజయం మీదే.. మనదే అంటూ ప్రశాంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
''కవితమ్మా..! ధైర్యంగా ఉండండి. పిచ్చి కుక్కలను వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంత మాత్రాన వేట ఆపుతామా? మేమంతా కేసీఆర్ కుటుంబసభ్యులం. నీవెంటే ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరు ఈ ధర్మ పోరాటంలో మీతో పాటు ఉన్నారు. ధర్మం మీ వైపు ఉంది.. అంతిమ విజయం మీదే.. మనదే.''- ప్రశాంత్‌రెడ్డి ట్వీట్
BRS supports with MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేరుకున్నారు. కవితపై జరుగుతున్న ఈడీ దర్యాప్తును దేశం యావత్తు గమనిస్తోందని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద కేసులు అవుతున్నాయో చూస్తున్నారని అన్నారు. బీజేపీ వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని.. వారు సచ్ఛీలురా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించకపోతే ఏ కేసులు ఉండవని వివరించారు. కేవలం ప్రతిపక్ష నేతలపై మాత్రమే ఎందుకు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.