BRS Ministers fires on PM Modi Speech in Hyderabad : రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్ర సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని చేసిన ఆరోపణలపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రధాని చర్చకు సిద్ధమా ? :అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి రాజకీయాలు చేయడం మంచిది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. ప్రధాని తమతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలన్నారు. దేశంలోని అవినీతిపరులను చేర్చుకుని పునీతులను చేస్తున్నది బీజేపీ అని ధ్వజమెత్తారు. అదానీపై ప్రపంచమంతా మాట్లాడుతుంటే.. ప్రధాని మాట్లాడట్లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చి మరీ తిట్టాలా.. దిల్లీలో కూర్చోని తిట్టొచ్చు కదా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
'ఏ అభివృద్ధి పనులు కేంద్రం చేస్తోందని అడ్డుకుంటున్నాం. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. అదానీపై జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోంది. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంట్‌పై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్ధమా ? బీజేపీలో కుటుంబ పాలన లేదా ? కర్ణాటకలో అవినీతిపై ప్రధాని ఎందుకు మాట్లాడరు ? భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు. అక్కడి నుంచే కదా ప్రధాని-సీఎం మధ్య దూరం పెరిగింది.'- తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక శాఖ మంత్రి
ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ :మెడికల్ కళాశాలలు ఇస్తే ఎవరైనా కాదన్నారా అని తలసాని ధ్వజమెత్తారు. దేశానికి ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణలో అద్భతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాం.. అక్కడే విగ్రహం ఏర్పాటు చేశామన్న తలసాని.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. తిరుపతికి ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి.. కొత్తగా రైలు కనిపెట్టి ప్రారంభించినట్లు మోదీ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు తెలంగాణకే వస్తున్నాయని తలసాని స్పష్టం చేశారు.