KTR Comments on IT Sector in Assembly 2023-24 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శాసనసభలో రాష్ట్ర ప్రగతిని.. గూగుల్ మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని అన్నారు. 2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఆ సంఖ్య 8.70 లక్షలకు చేరిందని తెలిపారు.
KTR Speech in TS Assembly Sessions 2023-24 : గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 4.50 లక్షల ఉద్యోగాల్లో మన వాటా లక్షన్నర ఉద్యోగాలు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటింది. సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్ పరిశ్రమ నెలకొంది. అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Telangana Assembly Sessions 2023-24 : 'మేం స్టార్టప్ అంటున్నాం.. బీజేపీ ప్యాకప్ అంటోంది' అని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం రూ.12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వసంస్థల అమ్మకంతో బీసీ,ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ తర్వాత కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తామందని.. ఆ ప్యాకేజ్‌పై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?' అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
"ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి సామాన్యుల పొట్ట కొడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతున్నారు.. ఇద్దరు కొంటున్నారు. ముద్రా రుణాలు ఇచ్చాం.. అద్భుతాలు చేశాం అంటారు. పేదలకు, రైతులకు రూపాయి గ్రాంట్ కూడా ఇవ్వరు. ఒక్క ఫార్మా సంస్థ లేని ఉత్తరప్రదేశ్‌కి బల్క్‌డ్రగ్ పార్క్ ఇచ్చారు. డ్రగ్ హబ్ అయిన హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్ పార్క్ ఎందుకు ఇవ్వలేదు. సైన్స్‌లో మోదీకి నోబెల్ బహుమతి ఇస్తే బాగుంటుంది." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి
KTR Speech in TS budget sessions 2023 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా హామీలు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. వరదల సమయంలో హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గుజరాత్‌లో వరదలు వస్తే మాత్రం రూ.1000 కోట్లు ఇచ్చి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశానికి ప్రధానా.... గుజరాత్‌కు ప్రధానా అని ప్రశ్నించారు. ఉపన్యాసాలతో అవార్డులు రావని... కష్టపడితేనే అవార్డులు వస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో 26 కి.మీ. సైకిలింగ్ ట్రాక్ పెడుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ గల్లీ గల్లీలో బస్తీ దవాఖానా పెడుతున్నామని కేటీఆర్ వివరించారు.