తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - న్యూ ఇయర్ తర్వాత కేసీఆర్ బాస్ వస్తారు

BRS LokSabha Elections 2024 : సుమారు దశాబ్దంన్నర పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ కల నెరవేరేలా చేయడంలో తమదే నాయకత్వ పాత్ర అన్న కీర్తితో వరసగా రెండు శాసనసభ ఎన్నికల్లో విజయం. కానీ హ్యాట్రిక్‌ గడప ముందు బోల్తా. ఇదీ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి. పదేళ్ల అధికారం తర్వాత ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ దళం, దాన్ని మరచి లోక్‌సభ ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి కారు జోరు తగ్గలేదని చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న అధినేత కేసీఆర్‌ కోలుకుంటే ఆ పార్టీ ఎన్నికల కార్యాచరణ మరింత ముమ్మరం కానుంది.

BRS Focus on LokSabha Elections 2024
BRS Focus on LokSabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 1:56 PM IST

లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు

BRS Lok Sabha Elections 2024 : టీఆర్ఎస్‌ నుంచి అనేక డక్కా మొక్కీల తర్వాత ఇటీవలే పేరు మారిన బీఆర్ఎస్‌కు, తాజా శాసనసభ ఎన్నికల్లో పరాజయం అతిపెద్ద ఎదురుదెబ్బ. అయితే ఈ ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే అంటున్న గులాబీ పార్టీ, లోక్‌సభ ఎన్నికల్లో(BRS Focus on Lok Sabha Elections)వీలైనన్ని స్థానాల్లో గెలవడమే తదుపరి లక్ష్యంగా ప్రకటించింది. ఇందుకోసం పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది.

BRS on Parliament Poll 2024 :2019 లోక్‌సభ ఎన్నికలకు సారు - కారు - పదహారు నినాదంతో వెళ్లిన బీఆర్‌ఎస్, 9స్థానాలకే పరిమితమైంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే, గులాబీ పార్టీకి 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరింత శ్రమించి ఇంకా ఎక్కువ స్థానాలను గెల్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ కూడా ఆరంభించింది.

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తుంటి గాయానికి శస్త్రచికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. చేవెళ్ల స్థానంతో ఈ పని చేపట్టిన కేటీఆర్, ఇటీవల ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జ్‌లని స్పష్టం చేశారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ సూచించారు.

KCR Plans For Parliament Elections 2024 : మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌, జనవరి 3 నుంచి హైదరాబాద్‌లో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను ఆహ్వానిస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా గణతంత్ర దినోత్సవం నాటికి ఈ సమావేశాలను పూర్తి చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోసం, పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీ సమావేశాలను నిర్వహించనుంది.

'ఫలితాలను చూసి నిరాశపడొద్దు - బీఆర్‌ఎస్‌కు ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేక్ మాత్రమే'

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాలపై కూడా, బీఆర్‌ఎస్‌లో చర్చ ప్రారంభమైంది. 9 సిట్టింగ్ స్థానాలకు గాను మెదక్ ఎంపీకొత్త ప్రభాకర్‌రెడ్డి (Kotha Prabhakar Reddy) శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సర్దుబాటులో భాగంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి మెదక్ లోక్‌సభ నుంచి అవకాశం కల్పించాలని గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ పార్టీ అధినేత కేసీఆర్, పార్లమెంట్‌కు పోటీ చేయాలనుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు మారతాయని అంటున్నారు.

BRS Parliament Elections Plan 2024 : సిట్టింగ్ ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం పార్టీలో ఉంది. మల్కాజిగిరి లాంటి స్థానాల్లో పోటీకి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇటీవలి ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో అక్కడ మరొకరికి అవకాశం దక్కనుంది. మల్లారెడ్డి కుటుంబం నుంచి మరొకరు బరిలోకి దిగొచ్చన్న ప్రచారం ఉన్నా తమకు ఆ ఆలోచన లేదని ఆయన అంటున్నారు.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఆసక్తి

బీఆర్ఎస్‌ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరి కొన్ని స్థానాల్లో కూడా పోటీ ఉంది. నల్గొండ నుంచి పార్టీ అవకాశం ఇస్తే కుమారుడు అమిత్‌రెడ్డి పోటీ చేస్తారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యానించారు. భువనగిరి నుంచి ఓ మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఉద్యమకారుడు టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన స్థానాల్లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధినేత కేసీఆర్‌ కోలుకుని తిరిగి క్రియాశీలకంగా మారితే, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత మరింత ముమ్మరం కానుంది. కేసీఆర్‌ (KCR) రంగ ప్రవేశం చేస్తే పార్టీ శ్రేణుల్లో మరింత చురుకు పుడుతుందని, లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ ముమ్మరం కాగలదని భావిస్తున్నారు.

ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details