BRS leaders protest at Raj Bhavan: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు మేయర్ విజయ లక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు రాజ్‌భవన్‌కు వచ్చారు. వారు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు ఉదయమే అపాయింట్మెంట్ అడిగారు. దీనిపై రాజ్ భవన్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
ఆ క్రమంలో 5 గంటల సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మహిళ అభిమానులు, నగర మేయర్ విజయలక్ష్మీ, ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. వారికి లోనికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని పోలీసులు ముందుగానే ఊహించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ ముందు ధర్నాకు దిగారు. ముందుగానే అపాయింట్మెంట్ అడిగినా గవర్నర్ స్పందించ లేదని మేయర్ మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని కవితకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
రాజ్ భవన్ ముందు ధర్నాతో ఆ రోడ్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులతో రాజ్ భవన్ ముందు గందరగోళం నెలకొంది. కాసేపు నిరసనకు దిగిన గులాబీ శ్రేణులు అక్కడి నుంచి ట్యాంక్ బండ్‌కు బయలుదేరారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న డా బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల ర్యాలీతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
"మహిళా వారోత్సవాలు జరుగుతున్న వేళ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఆయన తక్షణం కవితకు క్షమాపణ చెప్పాలి. ప్రతి మహిళకు ఆయన క్షమాపణ చెప్పాలి. గవర్నర్ మా వినతి పత్రం తీసుకోవాలి. ఉదయం నుంచే గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఇంత వరకు ఇవ్వలేదు. కనీసం ఆమె నుంచి స్పందన రాలేదు."-విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్