BRS Leaders on SSC Exam Paper Leak: రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని భారత్ రాష్ట్ర సమితి విమర్శించింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలు పెంచి చదువులు మేం చెప్పిస్తే.. బీజేపీ వాళ్లు పేపర్లు లీక్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాషాయ కుట్రలు ప్రజలు గమనించాలని హరీశ్‌రావు కోరారు.
పదో తరగతి పరీక్ష పత్రాలను లీకులు చేసే స్థాయికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిగజారటం దౌర్భాగ్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌ని బదనాం చేయాలని బీజేపీ చూడడం దురదృష్టకరమని మంత్రి తెలిపారు. పరీక్షాపత్రాల లీకేజీ కేసులో ఒక జాతీయ పార్టీ.. రాష్ట్ర అధ్యక్షుడు జైలుకు పోయిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.
రాష్ట్రంలో ఏదో రకంగా అరాచకం సృష్టించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్యర్యంలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.