Adani issue debated in Parliament: పార్లమెంటులో అదానీ అంశం చర్చ జరిగితే అదానీ షేర్లు భారీగా పడిపోతాయని బీజేపీ భయపడుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు మండిపడ్డారు.. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చకు బీజేపీ భయపడుతోందని ఆరోపించిన ఆయన.. అదానీ.. మోదీ స్నేహితుడు కాబట్టే పార్లమెంటులో చర్చ జరపడం లేదని దుయ్యబట్టారు. దిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడిన కేశవరావు.. ఎల్‌ఐసీ ద్వారా అదానీకి రూ.వేల కోట్ల మేలు చేశారని ఆరోపించారు.
అదానీకి పరిమితంగానే రుణాలు ఇచ్చామని ఇప్పుడు ఎల్‌ఐసీ చెబుతోందని పేర్కొన్న కేకే.. పరిమితంగానైనా అక్రమాలు చేయవచ్చా అని ఎద్దేవా చేశారు. అదానీకి మేలు చేసేందుకు ఇతర పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. పారిశ్రామికవేత్తలను ఈడీ, సీబీఐ పేరిట కేంద్రం బెదిరిస్తోందని మండిపడ్డారు. అదానీ అంత వేగంగా ఎలా ప్రపంచ కుబేరుడయ్యారో విచారణ జరపాలని డిమాండ్ చేసిన కేశవరావు.. అధికారంలో ఉన్నారని దేశాన్ని అడ్డంగా దోచుకుంటారా? అని ప్రశ్నించారు.
"ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా చర్చించవచ్చు. పార్లమెంటులో చర్చ జరిగితే అదానీ షేర్లు పడిపోతాయని భయపడుతున్నారు. అదానీ అంశంపై చర్చే జరగకూడదని బీజేపీ భావిస్తోంది. అదానీకి ప్రభుత్వం అండగా నిలుస్తోంది."-కె. కేశవరావు, బీఆర్ఎస్ ఎంపీ